ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ప్రజాశక్తి-చాపాడు (మైదుకూరు)/కడప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన కడప జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్‌పి విద్యాసాగర్‌నాయుడు, జెసి అదితి సింగ్‌, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డితో కూడిన బృందం గురువారం పరిశీలించింది. ముందుగా మైదుకూరు కోర్టు సమీపంలోని హెలీప్యాడ్‌తోపాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించింది. మైదుకూరు ఆర్టీసీ బస్సు స్టేషన్‌ పరిసరాలు, ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించి ముఖ్యమంత్రి సభ ఏర్పాటుకు అవసరమైన అనుకులతలను పరిశీలించింది. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ అమలు తీరు పర్యవేక్షణలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించనున్న మైదుకూరు పట్టణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో నివాసాలను, పరిశుధ్య ఏర్పాట్లను కలెక్టర్‌, ఎస్‌పిలు పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు పక్కాగా ఉండాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కడప ఎయిర్‌పోర్టు, మైదుకూరు హెలిప్యాడ్‌, షెడ్యూలు ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల వద్ద ప్రోటోకాల్‌ మేరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బద్వేలు, కడప ఆర్‌డిఒలు చంద్రమోహన్‌, జాన్‌ ఇర్విన్‌, డిపఒ రాజ్యలక్ష్మి, డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌ నాయక్‌, మున్సిపల్‌, ఎపిఎంఎస్‌ఐడిసి, విద్యుత్‌, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.సిఎం పర్యటనను విజయవంతం చేయండి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైదుకూరు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్‌ హాలులో ముందస్తు ఏర్పాట్లపై జెసి అదితి సింగ్‌, డిఆర్‌ఒ విశ్వేశ్వర నాయుడులతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించామన్నారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికా బద్దంగా గట్టి ఏర్పాట్లు చేయాలని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్‌పి సిఇఒ ఓబులమ్మ, కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్‌డిఒలు జాన్‌ ఇర్వీన్‌, సాయిశ్రీ, చంద్రమోహన్‌, కడప మున్సిపల్‌ కమిషనర్‌ మనోజ్‌రెడ్డి, ఇన్‌ఛార్జి సిపిఒ హజరతయ్య, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు పాల్గొన్నారు.

➡️