రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలకు సీల్‌

May 14,2024 22:16

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : మన్యం జిల్లాలో స్ట్రాంగ్‌ రూంలకు సీల్‌ పడింది. స్ట్రాంగ్‌ రూంలను అత్యంత భద్రత మధ్య ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేశారు. సోమవారం పోలింగ్‌ అనంతరం ఉద్యాన కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రాలకు జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల నుంచి ఇవిఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి చేరుకుంది. ప్రతి పోలింగ్‌ కేంద్రం నుంచి వచ్చిన ఇవిఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి పూర్తి స్థాయిలో పరిశీలించి రిటర్నింగ్‌ అధికారులు, వారి సిబ్బంది తీసుకున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత మంగళవారం పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ, పార్లమెంటరీ నియోజకవర్గ పోలీసు పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి, వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌, ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ఎస్‌ శోబిక, పార్వతీపురం పిఒ, సాలూరు ఆర్‌ఒ సి.విష్ణుచరణ్‌, సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకొండ ఆర్‌ఒ శుభం బన్సల్‌, పార్వతీపురం ఆర్‌డిఒ, ఆర్‌ఒ కె.హేమలత, పాలకొండ ఆర్‌డిఒ, కురుపాం ఆర్‌ఒ వి.వెంకట రమణ సీల్‌ వేశారు. పార్లమెంటు, శాసన సభ నియోజక వర్గాలకు వేర్వేరుగా స్ట్రాంగ్‌ రూంలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూంల్లోకి వివిధ పార్టీల ప్రతినిధులు వెళ్లి పరిశీలించిన అనంతరం సీల్‌ వేశారు. పార్టీల ప్రతినిధులు సీల్‌ పై సంతకాలు చేశారు. స్ట్రాంగ్‌ రూంలకు మూడంచెల భద్రత, బందోబస్తు కల్పించారు. మొదటి స్థాయిలో స్థానిక పోలీసులు, రెండో స్థాయిలో రాష్ట్ర సాయుధ బలగాలు, మూడో స్థాయిలో కేంద్ర సాయుధ బలగాల పహారా ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు పహారాతో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతకుముందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్ట్రాంగ్‌ రూంల ఏర్పాటు, వాటి భద్రత తదితర విషయాలను జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి రోజు వచ్చి స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించవచ్చని కలెక్టర్‌ తెలిపారు. వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని, వారికి నేరుగా ప్రవేశం ఉంటుందని చెప్పారు. జిల్లాలో ప్రశాంతంగా సజావుగా ఎన్నికల నిర్వహణకు సహకరించిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. స్వయంగా అనేక పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాలు పరిధిలో జరిగిన సరళిని పరిశీలించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, ఎస్డిసి ఆర్‌వి సూర్యనారాయణ, అదనపు ఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌, ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️