ఘర్షణల నేపథ్యంలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

May 16,2024 23:45

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్‌ విధించిన నేపథ్యంలో నాగార్జున సాగర్‌, విజయపురిసౌత్‌లో ఎస్‌ఐ డివి కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసిపి, టిడిపి నాయకులను ఎస్‌ఐ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ఎవరైనా ఘర్షణలకు, అల్లర్లకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. విజయపురిసౌత్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తేవాలన్నారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి పట్టణంలో రెండోరోజు కూడా 144 సెక్ష అమలు కొనసాగింది. ఎన్నికల అనంతరం గ్రామాల్లో జరిగిన హింసాకాండ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం కూడా దుకాణాలను పోలీసులు ముయించారు. దూకాణాలు తెరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసర సర్వీసులను మినహాయించారు. మెడికల్‌ దుకాణాలు పాల బూత్‌లు మినహా మిగతా దుకాణాలు బంద్‌ చేశారు. దుకాణాలు మూతపడటంతో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గ్రామాలనుండి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు సరుకులు దొరక్క అవస్థ పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు బోసిపోయాయి. టి దుకాణాలు మూసివేయటంతో గుక్కెడు టీ దొరక్క నిరుత్సాహపడ్డారు.
ప్రజాశక్తి – బెల్లంకొండ : ఎస్పీ ఆదేశాల మేరకు బెల్లంకొండ మండలంలో 144 సెక్షన్‌ శుక్రవారం అమలు కానుంది. ఎస్‌ఐ రాజేష్‌ మాట్లాడుతూ మెడికల్‌ షాపులు కూరగాయలు, పాలు దుకాణాలు మాత్రమే తెరచి ఉంటాయని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా బయట తిరగరాదని, గుమ్మిగూడొద్దని కోరారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️