అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యం పట్టివేత

గబుడుపుట్టు డిఆర్‌ డిపో సీజ్‌ చేసిన అధికారులు

ప్రజాశక్తి-పెదబయలు : మండలంలోని ఇంజరి పంచాయతీ గబుడుపుట్టు డిఆర్‌ డిపో నుంచి 4847కిలోల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. డిపో నుంచి బియ్యం తరలిపోతున్న ఘటనపై స్థానిక యువత వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీహరి, స్థానిక తహశీల్దార్‌ రాజారామ్మోహన్‌రారు, ఎంఆర్‌ఐ సింహాచలం తదితరులు రేషన్‌డిపోను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించగా, రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్థారణ కావడంతో డిపోను సీజ్‌ చేశారు. రేషన్‌డీలర్‌ మల్లేశ్వరరావుపై 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గబుడుపుట్టు రేషన్‌డిపో నిర్వహణ బాధ్యతలను పక్కనున్న లక్ష్మీపేట డిపో సేల్స్‌మ్యాన్‌ పరదేశి బుజ్జికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కాగా అధికారుల విచారణలో గబుడుపుట్టు రేషన్‌డిపో సేల్స్‌మ్యాన్‌ మల్లేశ్వరరావు పాడేరులో ఉంటూ, గ్రామంలో తిమోతి అనే వ్యక్తి ద్వారా డిపోను నిర్వహిస్తున్నాడని, రేషన్‌ పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నాడని స్థానికులు అధికారులకు వివరించారు. అక్రమాలకు పాల్పడుతున్న గబుడుపుట్టు రేషన్‌డిపో సేల్స్‌మేన్‌ మల్లేశ్వరరావును మార్పు చేయాలని విన్నవించారు.

స్టాక్‌ను పరిశీలిస్తున్న అధికారులు

➡️