ప్రజాశక్తి-బేస్తవారిపేట : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. లక్షల మందితో పోటీపడి ఉద్యోగం సాధించడం ఆషామాషీ కాదు. కానీ మండలంలోని శింగరపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఇప్పటికే పోలీసు ఉద్యోగం సాధించాడు. విధులు నిర్వర్తిస్తూనే తన లక్ష్యమైన గ్రూప్-4లో తాజాగా ఉద్యోగం సాధించి ఔరా అనిపించాడు. శింగరపల్లి గ్రామానికి చెందిన కామునూరి చంద్రమోహన్, జ్యోతి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా మొదటి కుమారుడైన కామునూరి విజయకుమార్ చిన్నప్పటినుంచి చదువులో ప్రతిభను కనబర్చుతూ వచ్చారు. పాఠశాల విద్య మొదలైనప్పటి నుంచి విజయకుమార్ టాపర్. తన ప్రాథమిక విద్యను తెలంగాణ రాష్ట్రంలోని ఉప్పల్‌లో పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్‌ను ఒంగోలులోని ప్రతిభ కాలేజ్‌లో, బీటెక్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. కాగా మొదట గత ఏడాది నవంబర్లో మొదటి ప్రయత్నంలోనే ఆయన సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదలకుండా తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. విధుల్లో చేరిన నెలలోపే టీజీఎస్పీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసింది. పట్టుదలతో ఎలాగైనా గ్రూపు 4 ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నెలరోజుల వ్యవధిలోనే తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-4 లోనూ 12వ ర్యాంకుతో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. నెలరోజుల వ్యవధిలోనే విజరుకుమార్ ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.