తైక్వాండోతో బాలికలకు ఆత్మరక్షణ

ప్రజాశక్తి-కొండపి : బాలికల ఆత్మ రక్షణకు తైక్వాండో ఎంతో అవసరమని కొండపి ఎస్‌ఐ కృష్ణబాజి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ యం.వెంకటేశ్వర్లు తెలిపారు. మండల పరిధిలోని కట్టావారిపాలెం గ్రామంలో స్థానిక స్వచ్చంద సంస్థ మన ఊరి వికాసం ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో వేసవి శిక్షణ ముగింపు సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం, విద్యార్థుల నైపుణ్యం పెంపుదలకు ఎన్‌ఆర్‌ఐలు ధర్మవరపు ప్రసాదు, బెజవాడ వెంకట్‌ చేస్తున్న కషిని వారు అభినందించారు. తైక్వాండో చీఫ్‌ ఇనస్ట్రక్టర్‌, అంతర్జాతీయ ఐటిఎఫ్‌ మెంబరు ఉన్నం మారుతి ప్రసాదు మాట్లాడుతూ ఉత్సాహం కలిగిని గ్రామీణ యువతీ,. యువకులకు ఉచితంగా తైక్వాండో శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఛాంపియన్లు తీర్చి దిద్దటమే తన లక్ష్యమని తెలిపారు. కట్టావారిపాలెం గ్రామంలో శిక్షణ పొందిన విద్యార్ధులకు గతంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించడం గర్వ కారణంగా ఉందన్నారు. వేసవి సెలవల్లో జిల్లాలో పది ప్రాంతాల్లో సుమారు రెండు వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలను అభినందించారు. అనంతరం తైక్వాండో శిక్షణ పొందిన విద్యార్థులు బ్లాక్‌ బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విద్యార్ధులు తైక్వాండో విద్యను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకులు పవన్‌, బాలాజీ, లీలా మైత్రి,శ్రీనివాస్‌, గ్రామ పెద్దలు రావెళ్ళ చెంచయ్య, బొక్కిసం సుబ్బారావు, కట్టా రమణయ్య, వెంకటేశ్వర్లు, లాయర్‌ చెంచు రామయ్య,గుంటుపల్లి పద్మావతి,అద్దేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️