ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో భగత్ సింగ్ కాలనీలో శుక్రవారం రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా … మహిళా నాయకురాలు వెంకటమ్మ జెండా ఆవిష్కరణ చేశారు. అఖిల భారత కిసాన్ సభ 1936 ఏప్రిల్ 11న లక్నోలో ఏర్పడింది. అప్పటికే వివిధ రాష్ట్రాలలో పని చేస్తున్న రైతు సంఘాల నాయకులందరూ దానికి హాజరయ్యారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్ట్ పార్టీలకు చెందిన రైతు నాయకులు అందరూ హాజరయ్యారు. ఆ సమావేశంలో మూడు కర్తవ్యాలు రూపొందించారు. 1. భారత స్వాతంత్య్రం కోసం పోరాటం, 2. జమిందారీ విధానం రద్దు కోసం పోరాటం, 3. ఆర్థిక, సాంఘిక దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాటం. స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షుడిగా, ఎన్.జి.రంగా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎ.ఐ.కె.ఎస్ పతాకంగా ఎర్రజెండాను ఎంపిక చేసుకున్నారు. ఎ.ఐ.కె.ఎస్ పిలుపుతో దేశం నలుమూలలా రైతాంగం పెద్ద ఎత్తున స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గన్నది. అప్పటివరకు పట్టణాలకు, విద్యావంతులకు పరిమితమైన స్వాతంత్య్ర ఉద్యమం గ్రామీణ ప్రాంతాలలో విస్తరించి సకల ప్రజా ఉద్యమంగా మారింది. మరోవైపు జమీందారుల, వారి తాబేదారుల నిరంకుశాలకు, ఆర్థిక, సాంఘిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభమయ్యాయి. కేరళలో పున్నప్ర-వాయలార్, బెంగాల్‌లో తెబాగా, మహారాష్ట్రలో వర్లి ఆదివాసి, అస్సాంలో సుర్మావాలీ, త్రిపురలో ఆదివాసి పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలను అణచడానికి సాయుధ బలగాలను ప్రయోగించగా రైతాంగం చెదరకుండా, బెదరకుండా ప్రాణ త్యాగాలతో పోరాడి హక్కులను సాధించుకున్నారు. ఎ.ఐ.కె.ఎస్ పిలుపుతో ఆంధ్ర రాష్ట్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుండి తడ వరకు చారిత్రాత్మకమైన ‘రైతు రక్షణ యాత్ర’ జరిగింది. 1512 మైళ్ళు కాలినడకన గ్రామాలు పర్యటిస్తూ జమిందారులు, వారి తాబేదారుల దోపిడీలను దౌర్జన్యాలను వెలికి తీస్తూ రైతాంగాన్ని చైతన్య పరుస్తూ యాత్ర సాగింది. యాత్ర ముగింపుగా దళం సేకరించిన వివరాలతో, మహాజర్లతో మద్రాసు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. అనంతరం ‘ఎస్టేట్ ల్యాండ్ యాక్ట్ చట్టం’ వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాపితంగా జమిందారుల దౌర్జన్యాలకు, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాటాలు విజఅంభించాయి. మునగాల, చల్లపల్లి, మందస పోరాటాలలో ఎందరో రైతులు, మహిళల ప్రాణ బలిదానం జరిగింది. అంతిమంగా వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటాల ఫలితం స్వాతంత్య్రం అనంతరం జమిందారీ విధానం రద్దుకు దారితీసింది. ఈనాముల రద్దు చట్టం, కౌలుదారీ చట్టాలు, భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. స్వాతంత్య్రానంతరం అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం, పంటల మద్దతు ధరల చట్టం కోసం, ఆహార భద్రత చట్టం కోసం పోరాటాలు సాగాయి. రైతుల వద్ద పంటలు సేకరించే మార్కెట్ల చట్టాలు వచ్చాయి. పంజాబ్‌లో భాక్రానంగల్ ప్రాజెక్టు కోసం, ఆంధ్రాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం, రాయలసీమ కరువు సమస్యల పైన పలు పోరాటాలు సాగాయి. బంజరు భూముల ఉద్యమాలు జరిగాయి. ఎరువుల బ్లాక్ మార్కెట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు సాగాయి. ఈ కాలంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారి వారి స్వతంత్ర సంఘాలు స్థాపించుకున్నాయి. ఎ.ఐ.కె.ఎస్ తన ప్రస్థానాన్ని ముందుకు కొనసాగించింది. 1991 దశకంలో వచ్చిన సరళీకరణ విధానాలు వ్యవసాయ రంగాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఎ.ఐ.కె.ఎస్ ఒంటరిగా సరళీకరణ విధానాలను, డంకెల్ డ్రాఫ్ట్‌ను ప్రతిఘటించింది. సరళీకరణ విధానాలు ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. పాలక వర్గాలు రైతుల ఆత్మహత్యలను వక్రీకరించే ప్రయత్నం చేయగా, కిడ్నీలు అమ్ముకుంటున్న రైతుల దుస్థితిని ఎ.పి రైతు సంఘం వెలికి తీసింది. జస్టిస్ పి.ఎ. చౌదరి నాయకత్వాన ఏర్పడిన కమిషన్ అనేక విషయాలను బహిర్గతం చేయడంతో తప్పని స్థితిలో ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను గుర్తించిరది. క్రమంగా అన్ని సంఘాలు వివిధ రూపాలలో పోరాటాలు ప్రారంభించాయి. అనంతరం డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్ కమిషన్ ఏర్పరిచింది. స్వామినాథన్ కమిషన్ కూలంకుషంగా పరిశీలించి నేటి వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారాలు సూచించారు. అందులో ప్రధానమైనది సి2 ప్లస్ 50 పంటల మద్దతు ధరల పథకం, పాలక పార్టీలు అమలుకు పూనుకోలేదు. 2013 భూసేకరణ పునరావాస చట్టం వచ్చింది. అఖిల భారత కిసాన్ సభ సి2 ప్లస్ 50 చట్టం కోసం, రుణ విముక్తి కోసం అనేక రైతు సంఘాలను కలుపుకొని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పరిచింది. ఆ కమిటీలో 240 సంఘాలు చేరాయి. సి2 ప్లస్ 50 అమలు కోసం, రైతు రుణ విమోచన చట్టం కోసం పోరాటం ప్రారంభించాయి. సి2 ప్లస్ 50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బిజెపి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానానికి భిన్నంగా వ్యవహరించింది. మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీల హస్తగతం చేయడానికిగాను అప్రజాస్వామికంగా మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా 2020 నవంబరు 26న ‘చలో ఢిల్లీ’కి పిలుపు ఇవ్వగా రైతాంగం పెద్ద ఎత్తున కదిలింది. ఎ.ఐ.కె.ఎస్ చొరవతో మొత్తం 540 సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎమ్)గా ఏర్పడ్డాయి. పదమూడు మాసాల అనంతరం గత్యంతరం లేని స్థితిలో బి.జె.పి ప్రభుత్వం మూడు నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఢిల్లీ పరిసరాలలో జరిగే ఉద్యమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు విస్తరించడంలోను ఉద్యమానికి కార్మికవర్గం ఇతర ప్రజాతంత్ర ఉద్యమాల మద్దతు కూడగట్టడంలో ఎ.ఐ.కె.ఎస్ ప్రధాన పాత్ర వహించింది. ఉద్యమ విరమణ సందర్భంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. ఆ హామీని అమలుపరచకుండా రైతాంగాన్ని మోసిగించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలన్నిటిలో అదాని, అంబానీల ఉద్యోగులను సలహాదారులుగా నియమించింది. నేడు ఆ హామీకి భిన్నంగా మరలా మూడు చట్టాలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న సహకార వ్యవస్ధను కేంద్రం అధీనంలోకి తీసుకుంది. సహకార పరపతి సంఘాలను పాడి సహకార సంఘాలను మత్స్య సహకార సంఘాలను ఏకం చేసి, వాటిని కార్పొరేట్ అనుకూల సంపన్న వర్గాలకు అప్పజెప్పే విధంగా చట్టాలు మార్పు చేసింది. ఇప్పుడున్న మార్కెట్ చట్టాలను నిర్వీర్యం చేస్తూ కంపెనీల ప్రయోజనాలకు అనుకూలంగా 12 సవరణలు చేసింది. మద్దతు ధరలు, మార్కెట్లలో ప్రభుత్వ సంస్థల జోక్యం లేకుండా చేసింది. బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధికి సున్నా చుట్టింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పేరుతో 11 కోట్ల రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల అజమాయిషీలోకి నెట్టే చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాలు అమలులోకి వస్తే రైతులు నిర్వహించుకుంటున్న సహకార, పాడి సంఘాలు, మార్కెట్ కమిటీలు రైతుల చేతులలో ఉండవు. ఇప్పుడు అమలులో ఉన్న మార్కెటింగ్ శాఖ గోడౌన్లు, సిడబ్ల్యుసి గోడౌన్లు, ఎఫ్‌సిఐ గోడౌన్లు కార్పొరేట్ కంపెనీల వశం అవుతాయి. ఇవి గతంలో రద్దు చేసిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకన్నా ప్రమాదకరమైనవిగా ఎ.ఐ.కె.ఎస్, సంయుక్త కిసాన్ మోర్చా నిర్ధారించాయి. ఈ స్థితిలో సి2 ప్లస్ 50 ఫార్ములా ప్రకారం మద్దతు ధరల అమలు గ్యారంటీ చట్టం కోసం, ఒకసారి రైతుల రుణాల రద్దు కోసం పోరాటాన్ని పున:ప్రారంభించాలని ఎస్.కె.ఎమ్ పిలుపు ఇచ్చింది. పోరాటానికి రూపకల్పన చేయడం కోసం ఏప్రిల్ 21న ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా జనరల్ బాడీ జరగనుంది. ఎ.ఐ.కె.ఎస్ ఆవిర్భవించిన రోజ్క్కెన ఏప్రిల్ 11న గ్రామ గ్రామాన పతాకావిష్కరణ చేయాలని, రైతులతో సమావేశాలు నిర్వహించాలని, రాబోయే పోరాటానికి రైతాంగాన్ని సన్నద్ధం చేయాలని ఎ.ఐ.కె.ఎస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లాసహాయ కార్యదర్శి పీహెచ్ రాయుడు రైతు సంఘ మండల కార్యదర్శి రాము అవాజ్ మండల కార్యదర్శి వలి సరోజమ్మ తదితరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
భవిష్యత్ పోరాటానికి సన్నద్ధంగా : వ్యాసకర్త సీనియర్ రైతు నాయకులు వై.కేశవరావు
