25 ఏళ్లుగా రోడ్లపై మురుగు నీళ్లు

Mar 13,2025 00:32

తాడేపల్లి పట్టణంలోని పేదలతో మాట్లాడుతున్న సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజి
ప్రజాశక్తి- తాడేపల్లి :
రాష్ట్ర మంతా సిమెంటు రోడ్లు వేశామంటున్నారని, మా ఇళ్ల ముందు మాత్రం 25 ఏళ్లుగా మురుగుపారే మట్టిరోడ్లే గతయ్యాయని సిపిఎం నాయకులు ఎదుట ప్రజలు వాపోయారు. సిపిఎం చేపట్టిన ప్రజాచైతన్య యాత్రల్లో భాగంగా పట్టణంలోని రామయ్య కాలనీ, జజ్జీవన్‌రామ్‌ కాలనీ, లెనిన్‌ నగర్‌, ఇస్లాంపేటల్లో యాత్రలను సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజి బుధవారం ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి ఆ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతాజి మాట్లాడుతూ పేదలు నివాసం ఉండే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలన్నారు. తాడేపల్లి పట్టణంలో 35 ఏళ్ల నుండి అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్న పేదలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అది ప్రభుత్వ బాధ్యతని అన్నారు. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్‌ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బురగా వెంకటేశ్వర్లు, పట్టణ నాయకులు వేముల దుర్గారావు మాట్లాడుతూ గతంలో సిపిఎం ఆందోళనల ఫలితంగానే కొంతమేరకైనా అటువైపు ప్రాంతంలో తాగునీరు, వీధిలైట్లు, ఇళ్ల పునర్నిర్మాణం సాధ్యమైందని చెప్పారు. ప్రస్తుత సమస్యలపై పేదలంతా ఉద్యమాల్లో ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.  రెండేళ్లలో పుష్కరాలు రాబోతున్నాయని, గత పుష్కరాలప్పుడు సీతానగరంలోని పేదల ఇళ్లను తొలగించి ఉండవల్లి గుంటూరు ఛానల్‌ సమీపంలో తాత్కాలిక స్థలాలు కేటాయించినా పట్టాలు మాత్రం ఇవ్వలేదని పుష్కర కాలనీ పేదలు సిపిఎం నాయకుల ఎదుట వాపోయారు. కరెంట్‌ బిల్లులు మోత మోగిపోతున్నాయని, రూ.200 కరెంటు వినియోగిస్తే మరో రూ.300 వివిధ రకాల ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారని అన్నారు. తల్లికివందనం పథకం వస్తుందని నమ్మి పిల్లల్ని ప్రైవేటు బడుసల్లో చేర్పిస్తే ఇప్పుడు ఆ ఫీజులు చెల్లించలేక అవస్థ పడుతున్నామని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు డి. శ్రీనివాసకుమారి, వి.వెంకన్న, ఎస్‌కె జానీ, వి.రమణ, వేణు, మణి, మేరీ, ఎస్‌కె ఇర్ఫాన్‌, లక్ష్మీ, దుర్గా, రహంతో, వి.సామ్యేలు, కె.మేరీ, స్థానికులు కాళిదాసు, కోటేశ్వరి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మేడికొండూరు : మండల కేంద్రమైన మేడికొండూరు, యలవర్తిపాడులో ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించారు. పంటలకు ధరల్లేవని, పూర్తిగా నష్టపోయామని పలువురు రైతులు సిపిఎం నాయకుల ఎదుట వాపోయారు. అనంతరం సిపిఎం నాయకులు బి.రామకృష్ణ మాట్లాడుతూ మిర్చిని క్వింటాళ్‌ రూ.20 వేలకు కొనాలని, కొత్తకౌలురైతు చట్టం తేవాలని, కౌల్దార్లకు పంట రుణాలివ్వాలని, సాగుదార్లకు అన్నదాత సుభీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని కోరారు. అనంతరం ఆయా సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఇమామ్‌ షరీఫ్‌, సాంబయ్య, కరిముల్లా, మస్తాన్‌వలి పాల్గొన్నారు

సత్తెనపల్లిలో సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌

ప్రజాశక్తి – సత్తెనపల్లి: పెరిగిన విద్యుత్‌ చార్జీలతో విద్యుత్‌ వినియోగదారులు బంబేలెత్తుతున్నారు. ఒకరున్న ఇంటికి ఒక బల్బు, ఒక ఫ్యాను ఉంటేనే రూ.998 బిల్లు రావడంతో వాటిని సిపిఎం నాయకులకు చూపి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. పట్టణంలోని కొత్తపేటలో సిపిఎం ప్రజాచైతన్య యాత్రను బుధవారం నిర్వహించగా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ హాజరై స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. కొత్తపేటలో 10 ఇళ్లకు వచ్చిన విద్య్‌ు బిల్లులను పరిశీలించగా సగటున ప్రతిబిల్లుకు రూ.600 చొప్పున మొత్తం రూ.6 వేలు అదనంగా వచ్చినట్లు చెప్పారు. దీని ప్రకారం సత్తెనపల్లి పట్టణంలో సుమారు 10 వేల కనెక్షన్లు ఉన్నాయనుకుంటే రూ.60 లక్షలను ప్రతినెలా పట్టణవాసుల నుండి ప్రభుత్వం గుంజుతోందని చెప్పారు. గత ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచితే బాదుడే బాదుడు అంటూ కార్యక్రమాలు చేసిన కూటమి, తాము అధికారంలోకి వస్తే బిద్యుత్‌ ఛార్జీలు పెంచబోమన్న కూటమి ఇప్పుడు ఏం సమాధానమిస్తుందని నిలదీశారు. విల్లులను తగ్గించుకుంటే ఉద్యమం తప్పదన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు ఆర్‌.పురుషోత్తం, జె.రాజ్‌ కుమార్‌, డి.వెంకటేశ్వర్లు, జి.రజిని, పి.రామారావు, సిహెచ్‌ ఆంజనేయులు, స్థానికులు అంజనీదేవి, సుజాత, రవి పాల్గొన్నారు.

➡️