‘అన్నమాచార్య’ అక్రమాలపై విచారణ చేపట్టాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అన్నమాచార్య యూనివర్సిటీ నిర్వహిస్తున్న సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు ఖర్చు పెట్టాల్సింది విద్యార్థులా, యాజమాన్యమా అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, డి.వి.రమణ ప్రశ్నించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్‌ స్పందించి అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి బాగోతంపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్తపు మాంసాన్ని జలగల్లా పీల్చి పిప్పిచేస్తూ రాయలసీమ కరువు కాటకాల్లో ఉంటే అన్నమాచార్య విశ్వవిద్యాలయం మాత్రం లాభార్జనలో అగ్ర భాగాన ఉందన్నారు. మంత్రి లోకేష్‌ స్పందించి అన్నమాచార్య విశ్వవిద్యా లయంలో జరుగుతున్న అవినీతి బాగోతం, విద్యార్థుల వివేధింపులపై ఉన్నత విద్యా మండలితోపాటు, సిఐడి, ఈడి, ఏసిబి సమగ్ర విచారణ జరిపి అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను గుర్తించి అన్నమాచార్య విశ్వవిద్యాలయం గుర్తింపు రద్దుచేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, వంకలు, స్మశానాలు విద్యుత్‌ సబ్స్టేషన్లు ఏవి కూడా వదల కుండా పూర్తిస్థాయిలో వారికి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు చేస్తున్నా ఎందుకు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఈ వ్యవహారాలన్నింటి పైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సిల్వర్‌ జూబ్లీ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇప్పటికే అనేక అక్రమాల రూపంలో విద్యార్థుల జోబులకు చిల్లు వేసి వసూలు చేస్తున్నప్పటికీ సరిపోక మరో కొత్త పంతాన్ని ఎత్తుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మేధావులు అన్నమాచార్య విశ్వవిద్యాలయం సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనకూడదని, వాళ్ళ అవినీతి ఆరోపణలలో మీరు భాగస్వాములు కావద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరుణ్‌ పాల్గొన్నారు.

➡️