రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం నియోజకవర్గంలో బిసి హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ కు వినతి పత్రం ఇచ్చారు. మంత్రి గురువారం రాయదుర్గం పర్యటించిన సందర్భంగా మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. బీ సీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, సొంత భవనాలను ఏర్పాటు చేయాలనీ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ … రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా 8 బీసీ హాస్టల్స్ ఉండగా 6 హాస్టల్ లకు సొంతభవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు. శిథిలావస్థలో గల ప్రభుత్వ హాస్టల్ లకు సొంత భవనాలు కేటాయించి,వాటి మరమ్మత్తుల కోసం నిధులు విడుదల చేయాలన్నారు. గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన బిసి మహిళా గురుకుల పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు 2500 పెంచాలన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలో ఉన్న బిసి గురుకుల పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. హాస్టల్ సమస్యల పరిష్కారానికి కఅషి చేస్తామని మంత్రి సవితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ రాయదుర్గం తాలూకా అధ్యక్షులు శశికుమార్, కోశాధికారి దినకర్, ఉపా అధ్యక్షులు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
