ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : రాయలసీమ విశ్వవిద్యాలయంలో విద్యార్థినీలను వేధిస్తున్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం సరైనది కాదనీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా అన్నారు. విశ్వవిద్యాలయంలో మేధావులుగా తయారు చేయాల్సినటువంటి ప్రొఫెసర్ లే అమ్మాయిల పట్ల క్రూర మృగాలుగా ప్రవర్తిస్తూ వృత్తికే మాయని మచ్చ తెస్తున్నారు. గత కొద్ది నెలల నుండి తెలుగు విభాగానికి చెందినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓబులేష్ రాత్రి 10 గంటల సమయంలో మద్యం సేవించి తెలుగు విభాగానికి సంబంధించిన అమ్మాయిలకు గుర్తు తెలియని నెంబర్ నుండి ఒకరి తరువాత మరొకరికి ఫోన్ చేస్తూ వారితో అసభ్యంగా మాట్లాడుతూ వారిని వేధిస్తున్నారు. ఈ సంఘటనపై ఉపకులపతి ఎన్ టి కె నాయక్ కి జనవరి 10వ తేదీన ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఆయనపై చర్యలు తీసుకోలేకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వారు అన్నారు. ఫిర్యాదు చేసిన విద్యార్థినిలు గిరిజన వర్గానికి చెందినవారు కావడం వల్ల కొద్ది రోజులు విచారణ పేరుతో ఆలస్యం.. విద్యార్థులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరైనది కాదన్నారు. గతంలో కూడా కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఇలానే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే సస్పెండ్ చేసిన అధికారులు ఇప్పుడు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఓబులేసును విధుల నుండి బహిష్కరించాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి, నగర నాయకులు అబ్బు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ యూనివర్సిటీ లో విద్యార్థినీలను వేధిస్తున్న ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ
