ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : జరిగే ప్రతి అభివృద్ధి పనులు అందరి సమన్వయంతో నాణ్యత ప్రామాణాలతో పారదర్శకంగా జరగాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, మండల ప్రత్యేక అధికారి బి.శాంత కుమారి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన జరగాల్సిన సర్వసభ్య సమావేశం సభ్యుల వాకౌట్ తో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇందులో వైసిపి ప్రజా ప్రతినిధులకు ఫోటో కాల్ ప్రకారం సమాచారం లేకుండా పనులు జరుగుతున్నాయని, వైసిపి కేడర్ కు చెందిన ఎంపీపీతో సహా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశం నుంచి వాక్ అవుట్ చేశారు. దీంతో ఎంపీడీవో ఏ.రాజు మాట్లాడుతూ ఎంపీపీ, వైస్ ఎంపీపీలు అందుబాటులో లేనందున సమావేశాన్ని ముగించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఏ.రాజు, తాహసిల్దార్ కె.జె.ప్రకాష్ బాబు సమక్షంలో అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులను జరుగుతున్న జరగబోయే అభివృద్ధిపై ఆరా తీశారు. అలాగే అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, సిడిపిఓ ఏ.గజలక్ష్మి, హౌసింగ్ ఏఈ డి.శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ లావణ్య, పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సాయి కిషోర్, ఏపీఎం ధనరాజు, ఏపీఓ అరుణకుమారి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగలక్ష్మి, అరుంధతి, తదితరులు పాల్గొన్నారు.
అందరి సమన్వయంతో అభివృద్ధి జరగాలి : జిల్లా ఐసిడిఎస్ పిడి, మండల ప్రత్యేక అధికారి శాంతకుమారి
