నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి

ప్రజాశక్తి-మార్కాపురం:కరవు పీడిత ప్రాంతమైన పశ్చిమ ప్రకాశంలో నిర్మాణ దశలో ఉన్న ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ను పూర్తి చేసేందుకు ముంపు గ్రామాల్లోని నిర్వాసితులను మెరుగైన ప్యాకేజీతో ఆదుకునేందుకు వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించాలని అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. స్థానిక పూల సుబ్బయ్య శాంతి భవన్‌లో ‘వెలిగొండ’ కోసం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయిం పులు జరపాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు ఎంపిజె, ఎఐటియుసి, సిఐటియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ కమిటీ కో ఆర్డినేటర్‌ డికెఎం రఫీ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అందె నాసరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి సోమయ్య, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి సయ్యద్‌ జావీద్‌ అన్వర్‌ తదితరులు మాట్లాడారు. జిల్లా పశ్చిమ ప్రకాశం గత ఏడు దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాధారం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పశ్చిమ ప్రకాశానికి కృష్ణా జలాలే శరణ్యమన్నారు. పెద్దఎత్తున సాగిన పోరాటాల వల్ల నాటి పాలకులు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగి 28 సంవత్సరాలు దాటినా నేటికీ పూర్తి కాకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే వెలిగొండ ప్రాజెక్టును ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, వైసిపిలు ఉపయోగించుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఆయా పార్టీలకు ఏమాత్రం లేదన్నారు. చిత్తశుద్ధి కలిగివుంటే ఏనాడో వెలిగొండ పూర్తయ్యేదన్నారు. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన పంటలు పండక, పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసి, కృష్ణా జలాలు పారిస్తే 4 లక్షల 38 వేల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. వెలిగొండ నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల బాధితులకు నేటికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు. సొరంగ మార్గాలు మొదలుకుని ఫీడర్‌ కెనాల్‌ ఆసాంతం పిచ్చిచెట్లు దట్టంగా పెరిగాయని, వీటిని వెంటనే తొలగించాలని అన్నారు. మొదటి సొరంగం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, చిన్నచితకా పనులు పూర్తి చేస్తే తద్వారా నీటిని విడుదల చేయవచ్చన్నారు. 2019 అక్టోబర్‌కు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ ప్యాకేజీ నేటికీ అందలేదన్నారు. అర్హుల జాబితా 2019 అక్టోబర్‌తో కటాఫ్‌ కాకుండా 2025 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరినీ నిర్వాసితులుగా గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపిజె రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎ రజాక్‌, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి షేక్‌ ఖాశిం తదితరులు మాట్లాడారు. సిపిఐ పట్టణ కార్యదర్శి చిత్తారి పెద్దన్న, ఏపి రైతు సంఘం నాయకులు కొండయ్య, కోటేశ్వరరావు, కాశయ్య, సిపిఎం నాయకుడు డి తిరుపతిరెడ్డి, జి రాజశేఖర్‌రెడ్డి, నాగరాజు, నన్నేసా తదితరులు పాల్గొన్నారు.

➡️