స్వయం ఉపాధికి రుణాలు మంజూరు చేయాలి

Mar 20,2025 00:36

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
ప్రభుత్వం ప్రజల జీవనోపాదులను మెరుగుపర్చి పేదరికాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలకు, పరిశ్రమల ప్రోత్సాహానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మీ అధ్యక్షతన డిసెంబరు త్రైమాసికంకు సంబంధించిన డిస్ట్రిక్ట్‌ కన్సల్టేటీవ్‌ కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం (డీఎల్‌ఆర్సీ) సమావేశం నిర్వహించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2024-25లో భాగంగా 2024 డిసెంబరు 31 త్రైమాసికం వరకు సాధించిన పురోగతి వివరాలను కలెక్టర్‌కు లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు మహిపాల్‌రెడ్డి తెలియజేశారు. వ్యవసాయరంగానికి రూ.13,613.86 కోట్ల రుణలక్ష్యానికి రూ.12,565.67 కోట్లు (92.30శాతం), ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ. 9,495.21 కోట్లు రుణలక్ష్యానికి రూ.8,792.15 కోట్లు (92.59 శాతం) మొత్తంగా ప్రాధాన్యతా రంగానికి రూ. 24,501.93 కోట్ల రుణ లక్ష్యానికి రూ. 21,855.44 కోట్ల (89.19 శాతం) సాధించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక భధ్రతా పథకాలు పీఎంఎస్‌బీవై క్రింద 54,883 మంది నమోదు చేసుకోగా, పీఎంజేజేబీవై క్రింద 27,452 మంది నమోదు చేసుకున్నారన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో 2025 మార్చి 7 నాటికి 417 మందికి, పీఎం సూర్యఘర్‌ పథకం ద్వారా 1041 మందికి రుణాలు ఇచ్చినట్లు, పీఎంఈజీపీ పథకం ద్వారా 112 మంది, పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా 31 మంది లభ్దిదారులకు రుణాలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోను ఒక పారిశ్రామికవేత్త నినాదంతో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో రాయితీతో స్వయం ఉపాధి పధకాల ఏర్పాటును ప్రోత్సహిస్తు న్నందున దీనికి అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు. కౌలు రైతులకు తప్పనిసరిగా అన్ని బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. కౌలు రైతులకు రుణాలు మంజురులో చాలా బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించటంలో వెనుకబడి ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను గమనించి వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. భూ యజమానులకు కాకుండా పొలం సాగు చేస్తున్న కౌలు రైతులకు మాత్రమే పంట రుణాలు బ్యాంకర్లు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డీసీసీ కన్వీనర్‌, యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం, రీజనల్‌ హెడ్‌ ఎస్‌ జవహర్‌, ఆర్బీఐ ఎల్డీఓ నవీన్‌ చిరినేల్లి, నాబార్డు డీడీఎం జి శరత్‌బాబు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు మహిపాల్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️