ప్రజాశక్తి-బాపట్ల : రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజధానిని నిర్మించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు వై.నేతాజీ డిమాండ్ చేశారు. నెల్లూరు ఈనెల 1,2,3 తేదీల్లో నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం కోరుతూ రాజధాని ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రచార జాత శుక్రవారం బాపట్లకు చేరింది. తొలుత ప్రచార జాతా బృందానికి సిపిఎం పట్టణ, జిల్లా కమిటీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్త బస్టాండు చీలు రోడ్డు వద్ద ఉన్న కామ్రేడ్ చివుకుల శేషశాస్త్రి స్థూపానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన సభకు సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు టి. కష్ణమోహన్ అధ్యక్షత వహించారు.సభలో నేతాజీ మాట్లాడుతూ అమరావతి రాజధానిప్రజలకు ప్రయోజనకరమైనదిగా ఉండాలన్నారు. అప్పుల రాజధాని కారదన్నారు. అమరావతి రాజధాని ,రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధానిని కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లా అభికృద్ధికి గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. రెండు పార్టీలు ఒకే విధానాన్ని అవలంబిస్తుందని విమర్శించారు. ప్రచార జాతకు ముందు ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, బాపట్ల జిల్లా నాయకులు పి.కొండయ్య, కె శరత్,ఎన్.కోటేశ్వరావు , కె.నాగేశ్వరావు, బుచ్చిరాజు ,వై. శ్రీనివాస్ బొనిగల సుబ్బారావు, దేవరకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. చీరాల : అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంటు మంజూరు చేసి, విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు నేతాజీ కోరారు. సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదచేయాలని కోరుతూ చేపట్టిన రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి బయలు దేరి ప్రచార జాతా చీరాలకు చేరింది. ఈ సందర్భంగా స్థానిక ఐఎల్‌టిడి కంపెనీ వద్ద ఐటిసి నాయకులు, కార్మికులు జాతా బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక గడియార స్థంభం సెంటర్ వద్ద నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 1,2,3 తేదీలలో నెల్లూరులో జరగనున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. గత వైసిపి ప్రభుత్వం రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని పరిరక్షణ కోసం పోరాడుతున్న రైతులు ప్రజలపై కేసులు బనాయించినట్లు తెలిపారు. దీంతో రాజధాని నిర్మాణం నిలిచి పోయినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంత సిపిఎం నాయకులు రవి, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్.బాబూరావు, జిల్లా కమిటీ సభ్యులు పి.కొండయ్య, సిఐటియు కార్యదర్శి ఎం.వసంతరావు, విశ్రాంత ఉద్యోగుల నాయకులు డి.నరపరెడ్డి, ఐటిసి నాయకులు సుధీర్, కాలేషా, శివరాజు, పోతురాజు, సాంబశివరావు తదితరలు పాల్గొన్నారు. అద్దంకి : ప్రభుత్వాలు మారుతున్న పోలవరం నిర్వాసితుల బ్రతుకులు మారడం లేదని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఈనెల 1,2,3 తేదీల్లో నిర్వహిస్తున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను జయద్రం చేయాలని కోరుతూ పోలవరం నుంచి ప్రారంభమైన ప్రచార జాతా అద్దంకి చేరింది. ఈ సందర్భంగా సిపిఎం అద్దంకి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అద్దంకిలోని భవానీ సెంటర్‌లో జాతాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భవాని సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకూ బైకు, ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు పోలవరం ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. 19 సంవత్సరాలుగా పోలవరం గురించి మాట్లాడుతున్న పాలక పార్టీల నాయకులు. ప్రభుత్వ పెద్దలు నిర్వాసితుల సమస్యల గురించి మాట్లాడటం లేదని వాపోయారు. సంవత్సరానికి రెండు మూడు సార్లు వచ్చే వరదలతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని కొండ గుట్టల పైన నివసిస్తున్నట్లు తెలిపారు. గిరిజన జీవితంలో భాగమైన పశువులు, పక్షులు, గుడిసెలు పోలవరం నీటి గర్భంలో మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం సీనియర్ నాయకులు మోండ్రు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ మజుందర్, అద్దంకి పట్టణ కమిటీ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు స్థానిక సమస్యలలు వివరించారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, ఫ్రూట్ వెండర్స్ నాయకులు, మున్సిపల్ వర్కర్లు, సిపిఎం నాయకులు కె.రఘు చంద్ , పి.ఆదాము, రావులపల్లి కోటేశ్వరరావు, గంగాధర్, దశరథ, కెవి. శ్రీను,తోట వెంకటేశ్వర్లు, విజరుకుమార్ పాల్గొన్నారు.
