ప్రజాశక్తి-రామాపురం గాలివానతో నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలో గాలివాన ప్రభావంతో నష్టపోయిన పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం కురిసిన అకాల గాలివాన దెబ్బకు దశాబ్దాల మామిడి చెట్లు నేలకొరిగాయని తెలిపారు. టన్నులలో మామిడికాయలు రాలిపోయాయని చెప్పారు. రైతుకు అపార నష్టాన్ని కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సక్రమంగా కురువక రైతాంగం మామిడి తోటలను బిడ్డలను పెంచుకున్నట్లు పెంచుకున్నారని అలాంటి చెట్లు వేర్లతో సహా నేలకు ఒరిగి పోయిన మామిడి చెట్లనుచూసి రైతులు బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బోర్ల కింద సాగుచేసిన పొద్దుతిరుగుడు, వరి పంటలు నేలమట్టం అయ్యాయని తెలిపారు. మండలంలోని వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖల అధికారులు గ్రామాలలో పర్యటించి పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. రైతులకు సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పంటల బీమా అన్నదాత సుఖీభవ వెంటనే మంజూరు చేసి రైతులకు ఖాతాలో జమ చేసి నష్టపోయిన రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు షబ్బీర్‌బాషా, శివారెడ్డి, లక్ష్మిరెడ్డి, కిరణ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రామ్మోహన్, మదన, యువరాజు, రైతులు పాల్గొన్నారు.
