మాట్లాడుతున్న కుసుమకుమారి
ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ విద్యా రంగానికి ప్రమాదం పొంచి ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు ఎ.ఎన్.కుసుమకుమారి అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన విస్తత కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సంస్కరణల ముసుగులో తరగతుల తరలింపు తగదని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉండాలని అన్నారు. ఏ విద్యా కమిషన్‌గానీ, విద్యావేత్తగానీ 3,4,5 తరగతులు విడదీయాలని చెప్పలేదని తెలిపారు. విద్యారంగం బలోపేతానికి పాటుపడే పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్.లక్ష్మణరావును రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం కనీసం పిఆర్‌సి కమిటీని నియమించకపోవటం, ఐఆర్, డిఎ ప్రకటించక పోవటం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పిఎఫ్, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గౌరవాధ్యక్షులు పి.శ్రీని వాసరావు, సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, కోశాధికారి దౌలా, కార్యదర్శులు ఆదినారాయణ, సాంబశి వరావు, గోవిందయ్య, రంగారావు, ప్రసాదు, కేదార్‌నాథ్, శ్రీనివాసరావు, కోటిరెడ్డి, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
