మైలాన్ పరిశ్రమ ఎదుట కార్మికుల నిరసన
ప్రజాశక్తి – పూసపాటిరేగ : కార్మికులను మోసం చేస్తున్న ట్రియానిష్ లేబోరేటరీ (మైలాన్)లో ప్రీతికా ఇంజినీరింగ్ ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ దిలీప్‌పై చర్యలు తీసుకోవాలని కార్మికులు శుక్రవారం పరిశ్రమ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 77 మంది 20 ఏళ్లుగా మైలాన్‌లో ఫ్యాబ్రికేషన్ పని చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టర్ దిలీప్ గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. పిఎఫ్, ఇఎస్‌ఐ కట్టలేదన్నారు. కాంట్రాక్టర్ జిఎస్‌టి కూడా కట్టలేదని పరిశ్రమ యాజమాన్యం తమను పనిలోకి రానివ్వడం లేదని వాపోయారు. పరిశ్రమ ప్రతినిధులు, కాంట్రాక్టర్‌కు, తమకు సుమారు 15 సార్లు చర్చలు జరిగినా, ఫలితం లేదని చెప్పారు. ఎమ్‌పి కలిశెట్టి అప్పలనాయుడు దగ్గర కూడా పంచాయతీ జరిగినా ఫలితం లేదన్నారు. కాంట్రాక్టర్‌కు పరిశ్రమ యాజమాన్యం కొమ్ముకాసి, తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతోపాటు మిగతా మూడు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకాలేదని చెప్పారు. కార్మికులకు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు రౌతు స్వామినాయుడు సంఘీభావం తెలిపి, మాట్లాడారు. మూడు నెలలుగా కార్మికులను రోడ్డున పడేయడం అన్యాయమన్నారు. నిరసనలో కార్మికులు ఎస్.సూరి భాస్కరరావు, జె.సూరిబాబు, మధు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.