ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని మంచాడవలసలో రూ.11లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా రోడ్లపై గుంతలు చూశాం కానీ, గత ప్రభుత్వంలో గుంతల్లో రోడ్లు ఉండేవని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పిస్తున్నామన్నారు. సాలూరు నియోజకవర్గంలో 100 సిసి రోడ్ల పనులను రూ.5కోట్ల వ్యయంతో నిర్మించామని తెలిపారు. ఇందులో పాచిపెంట మండలంలో 27, మెంటాడ మండలంలో 20, మక్కువ మండలంలో 35, సాలూరు మండలంలో 22 రోడ్లు పూర్తయ్యాయని తెలిపారు. గిరిజన గ్రామాల్లో రహదారులు నిర్మించి డోలీ మోతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గిరిజన గ్రామాల్లో ఎక్కడా తాగునీరు, రోడ్లు సమస్య లేకుండా ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుందని ఆమె తెలిపారు. త్వరలోనే జిల్లాలో 63 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు వైసిపి నేతలు అడ్డుపడితే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఐటిడిఎ ద్వారా గిరిజనులకు ట్రై రుణాలు అందించి, జీవనాధారం కల్పించి గిరిజనులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చి పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిహెచ్ సావిత్రి, మండల టిడిపి అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్‌బాబు, నాయకులు గూడెపు యుగంధర్, ముఖీ సూర్యనారాయణ, ఆముదాల పరమేష్, కె.సురేష్, చల్లా కనక, కె.పోలినాయుడు, పి.నరసింగరావు, పి.ఉమామహేశ్వరరావు, మాతల బలరాం, జనసేన నాయకులు, ఎంపిడిఒ బివిజె పాత్రో, పంచాయతీరాజ్ శాఖ డిఇ చిన్నంనాయుడు, డిప్యూటీ తహశీల్దార్, పలు శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.