- లడ్డూ కేసు ప్రాథమిక దశలోనే : ‘సిట్’ చీఫ్ త్రిపాఠి
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్లు అందిన ఫిర్యాదుపై విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇతర అంశాలనూ పరిశీలిస్తున్నామని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. ఈ బృందం ఆదివారం కూడా దర్యాప్తు కొనసాగించింది. పద్మావతి అతిథి గృహంలో టిటిడి ఇఒ శ్యామలరావుతో సమావేశమైంది. అనంతరం మీడియాతో త్రిపాఠి మాట్లాడారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించామని, ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని ఎఆర్ డెయిరీపై ప్రధానంగా ఫిర్యాదు అందిందని, దీనిపై సిట్ విచారణ చేస్తోందని చెప్పారు. విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రికార్డుల స్వాధీనం, పరిశీలన
శ్రీవారి లడ్డూ కోసం వాడే నెయ్యి, యాలకులు, కలకండ, చక్కెరతోపాటు నైవేధ్యానికి వాడే నూనె, ఇతర సరుకుల కొనుగోలు రికార్డులను టిటిడి మార్కెట్ విభాగం నుంచి సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. వీటిని తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఒక బృందం పరిశీలిస్తోంది. గత ఐదేళ్లలోనూ, అంతకు ముందు ఐదేళ్లలోనూ టిటిడికి ఎంత నెయ్యి వచ్చింది? ఎన్ని రకాల సరుకులు వచ్చాయి? వాటి నాణ్యతపై ఆరా తీస్తోంది. టిటిడికి నెయ్యి సరఫరా చేసిన చెన్నరులోని ఎఆర్ డెయిరీకి మరో బృందం వెళ్లి విచారణ చేస్తోంది. మూడో బృందం సోమవారం ఉదయం తిరుమలలోని లడ్డూపోటు, అన్నదానం తయారీ విభాగం, లడ్డూ విక్రయశాలను పరిశీలించనుంది.