సామాన్యులకు సంపద కోసం పోరాడిన సీతారాం

Sep 30,2024 00:47

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : దేశంలో సంపద సృష్టించడం ఒకెత్తయితే దాన్ని సామాన్య ప్రజలకు చేర్చకుంటే ప్రయోజనం ఏమిటని ప్రభుత్వాలను సీతారాం ఏచూరి ప్రశ్నించే వారని, ఆర్థిక దుష్ఫలితాలపై నిత్యం తన గళాన్ని వినిపించిన ఆయన మరణం తీరని లోటని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ఇటీవల మరణించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. సభకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ అధ్యక్షత వహించగా తొలతు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్‌ ప్రసంగించారు. అనంతరం కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ సీతారాం ఏచూరిని సష్టించిందని గొప్ప రాజనీతజ్ఞుడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. మతతత్వాన్ని వ్యతిరేకించడం, లౌకికవాదం కోసం పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఇటీవల ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని కట్టడి చేయడానికి ఏర్పాటైన ఇండియా బ్లాక్‌ ఏర్పాటులో సీతారాం ముఖ్యభూమిక పోషించారని చెప్పారు. మోడీ పాలనలో రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యం, లౌకిక విధానాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. జమిలి ఎన్నికలు దేశ సమైక్య విధానాలకు ప్రమాదమని ఏచూరి ప్రచారం చేశారని గుర్తు చేశారు. బిజెపి విధానాలతో దేశానికి వస్తున్న పెను ప్రమాదాలను తిప్పికొట్టాల్సిన సమయంలో సీతారాం ఏచూరి మరణం బాధాకరమన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఏచూరిది చెరగని ముద్రన్నారు. అన్ని పార్టీల నాయకులను రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వకంగా పలకరించే ఏచూరి లాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. దృఢమైన విప్లవాత్మక నిబద్ధత, నిశితమైన వ్యూహాత్మక అంతర్‌ దృష్టితో చెరగని ముద్ర వేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్‌, ఎఐటియుసి పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు మాట్లాడుతూ 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాలను సీతారాం నిలదీశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించి, ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. వామపక్ష పార్టీలు బలపడడానికి ఉపయుక్తమైన విధానాలను కొనసాగించారని అన్నారు. ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష పార్టీలకు తీరని లోటన్నారు. ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి రెడ్‌ బాషా మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రజా సమస్యలు ప్రస్తావించి, దేశంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు ప్రస్తావించటంలో ప్రముఖ పాత్రను సీతారాం పోషించారని గుర్తు చేశారు. ఆయన సూచనలు పాలక, ప్రతిపక్షాలకు దిక్సూచిగా నిలిచియాన్నారు. ఆయన చూపిన బాటలో ప్రజా పోరాటాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన మహోన్నత వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. ఇతర నాయకులు మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం చేసే అనేక చట్టాల రూపకల్పనలో సీతారాం ఏచూరి పాత్ర ఎనలేనిదని గుర్తు చేసుకున్నారు. భారతదేశ వామపక్ష ఉద్యమంలో ఓ అరుణతార రాలిందని, ఓ సిద్దాంతకర్త, ఓ దార్శనికుణ్ణి దేశం కోల్పోయిందని, ఆయన ఆశయాలను కొనసాగింపు ఆయనకిచ్చే నివాళి అని ఉద్ఘాటించారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, వై.రాధాకృష్ణ, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, ఎం.రవిబాబు, ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, పట్టణ కార్యదర్శి షేక్‌.సిలార్‌ మసూద్‌, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు నాయకులు డి.శివకుమారి, కె.హనుమంత్‌రెడ్డి, మహేష్‌, జి.మల్లేశ్వరి, టి.పెద్దిరాజు, విమల, బాలకృష్ణ, పి.మహేష్‌, ఎవికె దుర్గారావు కె.రామారావు, కె.కోటేశ్వరరావు, ఆర్‌.శ్రీనివాసరావు, ఉదయశ్రీ, కె.లక్ష్మి, నాగమ్మబారు, యు.రంగయ్య, వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత తోకల కోటేశ్వరరావు సీతారాం ఏచూరి పై రచించి ఆలపించిన గీతం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రజానాట్యమండలి కళాకారులు ఏచూరి జీవిత చరిత్రను పాటల రూపంలో ప్రదర్శించారు.

➡️