పంపు స్టోరేజీ ప్రాజెక్టుకు స్థల పరిశీలన

పంపు స్టోరేజీ ప్రాజెక్టుకు స్థల పరిశీలన

ప్రజాశక్తి -సీలేరు: సీలేరు పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు స్థాపనకు అవసరమైన అటవీశాఖ అనుమతులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో ప్రాజెక్టుకు అటవీశాఖఅనుమతులు పూర్తిస్థాయిలో మంజూరు కానున్నాయని విశాఖ అటవీశాఖ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ కంఠనాధరెడ్డి వెల్లడించారు. బుధవారం సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పే పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టుకు అటవీ అనుమతులపై రిజర్వ్‌ ఫారెస్ట్‌ను పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు నాలుగు బిట్లలో 193హెక్టార్ల అటవీభూమి జెన్‌కోకు అవసరం. ఈ సందర్భంగా స్థానిక అటవీశాఖ టింబర్‌ డిపోలో విలేకరులతో మాట్లాడుతూ పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టుకు అవసరమైన అటవీ ప్రాంతాన్ని పరిశీలించామన్నారు. క పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైనదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సరిహద్దులు గుర్తింపు, ఎసెస్‌మెంట్‌ సర్వే పూర్తి చేశామన్నారు. పార్వతీ నగర్‌ శాండికోరి, జొన్న మామిడి, చర్చి వెనుక భాగంలో వేసిన ప్రాజెక్టు సర్వే రాళ్లను పరిశీలించమన్నారు.. చేపట్టిన సర్వే సక్రమంగా ఉన్నదీ లేనిదీ నిర్థారణకు తాను పరిశీలనకు వచ్చానన్నారు. నివేదికను పిసిసిఎఫ్‌ అందజేస్తామని, తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి ఒక అధికారి వచ్చి మరొకసారి ప్రాజెక్టును పరిశీలించి నివేదికను కేంద్ర అటవీశాఖ అనుమతుల కోసం నివేదిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరలోనే పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు చర్యలు వేగవంతం చేస్తుందన్నారు.విశాఖ సర్కిల్‌లో ఏకో టూరిజం అభివృద్ధ్ధికి చర్యలువిశాఖ సర్కిల్‌ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అల్లూరి జిల్లా అరుకు ఫారెస్ట్‌ కాంప్లెక్స్‌, అరుకు ఫైనరీలతోపాటు పార్వతీపురంలో సున్నపు గెడ్డ జలపాతాల వద్ద, విజయనగరం సారిపల్లి బేతనపల్లి ఏకో టూరిజం ప్రాజెక్టులు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయని వెల్లడించారు. చింతపల్లి డివిజన్‌ పరిధిలోని లంబసింగి వద్ద కృష్ణాపురం ఏకో టూరిజం ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. విజయనగరం జిల్లా వెలగాల వద్ద కూడా ఒక రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఉందని అక్కడే ఏకో టూరిజం ఏర్పాటుకు ఇటీవల అనుమతులు వచ్చేయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ టౌన్‌లో, అనకాపల్లి బయ్యవరం వద్ద నగరవనాలు మంజూరయ్యాయని, ఇప్పటికే విశాఖపట్నంలో నగర వనం అందుబాటులో ఉందన్నారు. ఎన్‌ఆర్‌జిఎస్‌ ద్వారా విశాఖ సర్కిల్‌ పరిధిలో 75 లక్షల మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకుప్రణాళికలు రూపొందించామన్నారు .కార్యక్రమంలో డి ఎఫ్‌ ఓ సూర్యనారాయణ పడాల్‌ సీలేరు కాంప్లెక్స్‌ ఏపీ జెన్కో చీఫ్‌ ఇంజనీర్‌ వాసుదేవరావు పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు ఎస్‌ ఇ సివిల్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ఎస్‌ ఈ సివిల్‌ రాంబద్ర రాజు ఏడిఈటి అప్పలనాయుడు ఎఇ సురేష్‌ పాల్గొన్నారు.

స్థల పరిశీలన చేస్తున్న సిసిఎఫ్‌ కంఠనాధరెడ్డి

➡️