ఇద్దరు పరారీ
రెండు వాహనాలు, సెల్ ఫోన్లు సీజ్
ప్రజాశక్తి-సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామ సమీపంలో వేటగానివలస జంక్షన్ వద్ద శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో తరలిస్తున్న 671 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి ఎస్‌వి మాధవరెడ్డి చెప్పారు. శుక్రవారం సాయంత్రం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు బొలేరో వాహనాల్లో అరుకు నుంచి సాలూరు వైపు వస్తుండగా ఆ వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. వాటిలో 30 ప్యాకెట్లలో 671 కిలోల గంజాయిని గుర్తించినట్లు చెప్పారు. దీని విలువ రూ.33.50 లక్షల వరకు ఉంటుందన్నారు. ఒడిశాకు చెందిన లక్ష్మి కాంత్ సెస, బత్తోరం కమెండో, తంగుల విశ్వనాథ్, కిల్లో వినోద్, బురిడి కృష్ణ, కొర్ర దంబురులను పాచిపెంట ఎస్‌ఐ వెంకట సురేష్ , పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రాజు, సోమనాథ్ అనే వ్యక్తులు పరారయ్యాయని చెప్పారు. వీరి నుంచి ఆరు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేయడం వెనుక సూత్రధారి కిషన్ కూడా పరారీలో ఉన్నాడని చెప్పారు. పడువ గ్రామానికి చెందిన కిషన్ కోసం గాలిస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో రూరల్ సిఐ రామకృష్ణ, ఎస్‌ఐలు నర్సింహమూర్తి, వెంకటరమణ, వెంకట సురేష్ వున్నారు .