లోయలో పడిన కారు – ఆరుగురికి గాయాలు

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఆరుగురికి స్వల్ప గాయాలైన ఘటన మంగళవారం రాత్రి తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగింది. చంద్రగిరి మండలంలోని తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిలో బాకరాపేట ఘాట్‌ రోడ్లు వద్ద నిన్న అర్ధరాత్రి కారు అదుపుతప్పి లోయలో పడింది. బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న కారు అదుపుతప్పి 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయం కావడంతో కారులోని ప్రయాణికులను రోడ్డుపై వెళుతున్న వాహన చోదకులు గుర్తించి లోయలో నుంచి రోడ్డుపైకి తీసుకొచ్చారు. కారును ఉదయం స్థానికుల సహాయంతో బయటకు తీశారు. డ్రైవర్‌ చాకచక్యంగా కారువేగాన్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని, కారు అద్దాలు పగిలిపోయి మరమ్మతులకు గురైందని స్థానికులు తెలిపారు.

➡️