పోలింగ్‌ కేంద్రాల్లో స్వల్ప మార్పులు, చేర్పులు : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి రాజకీయ పార్టీల అభిప్రాయాలు, నిబంధనల మేరకు అన్నమయ్య జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ (స్వల్ప మార్పులు, చేర్పులు) చేయబో తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో అన్నమయ్య జిల్లాలో ఓటర్ల సవరణ – 2025, పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ నరసింహ కుమార్‌ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ఓటర్ల సవరణ ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పై రాజకీయ పార్టీ ప్రతినిధులకు క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేటితో ఓటర్ల సవరణపై ఇంటింటికి వెళ్లి సర్వే చేసే ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రాజంపేటలో ఒక నూతన పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు, రాయచోటిలో 8 పోలింగ్‌ కేంద్రాల స్థానం మార్పు, తంబళ్లపల్లిలో ఒక పోలింగ్‌ కేంద్రం పేరు మార్పు, మదనపల్లి నియోజకవర్గంలో రెండు పోలింగ్‌ కేంద్రాల స్థానం మార్పు, తదితర అంశాలను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఈ మార్పులు, చేర్పులపై ఇదివరకే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సబ్‌ కలెక్టర్‌ లేదా ఆర్‌డిఒ అక్కడి రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపమని రాజకీయ పార్టీ ప్రతినిధులను అడగగా అభ్యంతరాలు ఏమీ లేనట్లుగా వారు తెలిపారు. కొత్తగా ఏమైనా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, మార్పులు కావాలి అనుకుంటే దానికి మళ్ళీ ఎన్నికల సంఘం వారు అవకాశం ఇస్తారని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులపై నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం వారికి త్వరలో పంపుతున్నట్లుగా కలెక్టర్‌ పేర్కొన్నారు. మార్పులు, చేర్పుల నివేదికను ఎన్నికల సంఘం వారు అంగీకరించిన తర్వాత జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులపై ప్రజలందరికీ తెలిసేలా చర్యలు చేపట్టాలని ఎలక్షన్‌ సెల్‌ అధికారులను, రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు.

➡️