చిరుద్యోగులను తిరిగి నియమించాలి

Mar 10,2025 21:30

సిఐటియు ఆధ్వర్యాన నిరసన

ప్రజాశక్తి పార్వతీపురం :  తొలగించిన మధ్యాహ్న భోజనం, స్కూల్‌ సీపర్లు, విఒఎలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, డైలీ వేస్‌, గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్లను నియమించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం అధ్యక్షులు జి.తులసి, కార్యదర్శి వై.శాంత కుమారి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో చిరు ఉద్యోగస్తులపైన రాజకీయంగా కక్ష సాధిస్తూ వాళ్ల కుటుంబాల్ని రోడ్డుపై నెట్టేస్తున్నారన్నారు. బలిజిపేట మండలం అరసాడ, కొమరాడ మండలం కోటిపాం, పార్వతీపురంలోని కొత్తవలస పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు, విఒఎలుపైన, డైలీ వేజ్‌ పైన కక్ష సాధింపులు భాగంగా తొలగించడం అన్యాయన్నారు. తొలగించిన వారిని విధుల్లో చేర్చుకోవాలని కోరారు. అలాగే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్లకు న్యాయం చేస్తానని, రూ.10వేలు వేతనం ఇస్తామని నమ్మబలికి వారికి ద్రోహం చేసింది కూటమి ప్రభుత్వమని, కావున తొలగించిన స్కీమ్‌ వర్కర్లు ఉద్యోగస్తులను నియమించాలని, హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం బలిజిపేట మండలం అరసాడ హైస్కూలు, ప్రాథమిక మధ్యాహ్న భోజన కార్మికులు, సీపర్లు పాతవారిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీరికి ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మద్దతు తెలియజేస్తూ మన్యం జిల్లాలో చిరు ఉద్యోగస్తులపైన రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు దిగడం పద్ధతి కాదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పేదల పొట్ట కొట్టడం తొలగించడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు. పార్వతీపురం మున్సిపాలిటీ కొత్తవలసలో బలవంతంగా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిస్తున్నారని, జిల్లాలో చిరు ఉద్యోగస్తులపై ఇలా దాడి చేయడం పద్ధతి కాదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు, స్కూల్‌ స్వీపర్లకు గుర్తింపు కార్డులు, యూనిఫాం, కాటన్‌ చీరలు, మౌలిక సదుపాయాలు, సబ్సిడీ గ్యాస్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం ధర్నా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ధర్నా వద్దకు వచ్చి కార్మికుల సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిర, సిఐటియు కోశాధికారి జి.వెంకటరమణ, నాయకులు బి.సూరిబాబు, సంచాన ఉమా, డ్రైవర్‌ అమ్మ , భవాని, లక్ష్మి, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

➡️