ప్రజాశక్తి-విజయనగరంకోట : హోంగార్డుల ఆర్థిక అవసరాలకు అండగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఉంటుందని ఎస్‌పి వకుల్‌జిందాల్ తెలిపారపు. వ్యక్తిగత రుణాల పరిమితిని సభ్యుల అంగీకారంతో రూ.75వేలు నుంచి లక్ష రూపాయలకు, మ్యారేజ్ రుణాలను రూ. 1 లక్ష నుండి రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపారు. హోంగార్డ్సు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశం మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌పి మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమంతోపాటు హోంగార్డుల సంక్షేమానికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీతో రుణాలను మంజూరు చేసి, వారి ఆర్ధిక అవసరాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. రుణాలపై ఇంత వరకు విధిస్తున్న 6 శాతం వడ్డీని 4.08 శాతానికి తగ్గిస్తున్నట్లుగా చ్పెఆ్పరు. సొసైటీని మరింత అభివృద్ధి, ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యుల నుండి సలహాలను, సూచనలను స్వీకరించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఎస్‌బి సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఆర్‌ఎస్‌ఐ ఎన్. గోపాల నాయుడు, ఇతర పోలీసు అధికారులు, కో-ఆపరేటివ్ సెక్రటరీ ఎం.సుశీల, ఎం.నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు శంకరరావు, గోపాలరావు, పి.రమణ, వి.మహేశ్వరరావు, పి.బంగారురాజు తదితరులు పాల్గొన్నారు.
