ప్రజాశక్తి -గోపాలపట్నం : ఎన్‌ఎడిలో కార్మికుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలకు స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) నాయకులు సోమవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, ఎన్‌ఎడిలో సస్పెండ్ అయిన 36 మంది కార్మికులు, నాయకులను తిరిగి డ్యూటీలో చేరేంతవరకు తమ యూనియన్ అండగా ఉంటుందని చెప్పారు. కార్మికుల హక్కుల కోసం నిలబడిన నాయకులపై ప్రతి యాజమాన్యమూ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. అయినా అంతిమ విజయం కార్మికులదే అవుతుందని స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వైటి.దాసు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం సమాజంలోని అన్ని రంగాలపై దాడి చేస్తుందన్నారు. ఆధునిక దేవాలయాలగా కీర్తింపబడిన పబ్లిక్ రంగ సంస్థలను, చివరికి రక్షణ రంగాన్ని సైతం కార్పొరేట్ గుత్త పెట్టుబడిదారి సంస్థలకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. అంబేద్కర్ ప్రసాదించిన ఓటు అనే ఆయుదాన్ని సద్వినియోగం చేసుకొని మన తరపున నిలబడే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిఫెన్స్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకట్రావు మాట్లాడుతూ, కార్మికుల సస్పెన్షన్లు ఎత్తివేయుటకు యాజమాన్యం తగిన చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమలో నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
