ఎన్‌ఎడి కార్మికుల పోరాటానికి సంఘీభావం

ఎన్‌ఎడి కార్మికుల పోరాటానికి సంఘీభావం

12న రక్షణరంగ కార్యాలయాల ఎదుట ఆందోళనకు పిలుపు

ప్రజాశక్తి -గోపాలపట్నం : 36మంది కార్మిక నేతలను అరెస్ట్‌ చేసి, ఆరుగురిపై కోర్టులో కేసు పెట్టిన ఎన్‌ఎడి యాజమాన్య వైఖరిని ఖండిస్తూ, వారికి సంఘీభావంగా మంగళవారం విశాఖలో రక్షణరంగంలో ఉన్న అన్ని యూనియన్లు, అసోసియేషన్ల నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా నేవల్‌ డాక్‌యార్డు, ఎన్‌ఎడి గేట్ల వద్ద జరిగిన నిరసనలో ఎన్‌ఎడిసి యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గుప్తల శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఎన్‌ఎడి యాజమాన్యం పునరాలోచించి, ఆరుగురిపై పెట్టిన కేసులను ఎత్తేయాలని, 36మందిపై సస్పెన్షన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు కష్టబడి పనిచేసిన ఒటిలకు పేమెంట్లు చేయాలని కోరారు.దీనిపై ఈనెల 12న దేశవ్యాప్తంగా అన్ని రక్షణ రంగ సంస్థల ఎదుట నిరసన చేపట్టాలని ఆలిండియా డిఫెన్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఇప్పటికే పిలుపునిచ్చిందన్నారు. కార్మికులు, కార్మికసంఘాల నాయకులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా యాంటీ విక్టిమేజేషన్‌ డే జరపాలని అన్ని రక్షణరంగ యూనియన్లు తీర్మానించాయని, ఆ ఆందోళన జయప్రదంచేయాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎడి యాజమాన్యం స్పందించకుంటే, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. నిరసనలో పెద్దఎత్తున కార్మికులు, యూనియన్‌ నేతలు పాల్గొన్నారు.

➡️