ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ : కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి -పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమాలు, పాఠశాలల్లోని అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం పాడేరులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన భారీ ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షలు కె.కార్తీక్ శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు పి.చిన్నారావు మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరిట ప్రభుత్వాలు గిరిజన విద్యావ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేశాయని మండిపడ్డారు. డిగ్రీ విద్యలో చేపట్టిన సంస్కరణలతో బోధన, విద్యానాణ్యత మెరుగుపడే పరిస్థితి లేదన్నారు. డిగ్రీ విధానంలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు రూ.3,480 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు. అంతకుముందు ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు సంబంధం లేకుండా నేరుగా కాలేజీలకు జమ చేయడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండేదన్నారు. అయితే గత వైసిపి ప్రభుత్వం అమలుచేసిన విద్యా, వసతి దీవెనల్లో రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని తల్లులు ఖాతాలకు జమ చేయడం, వారి తిరిగి కాలేజీలకు చెల్లించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉండేవన్నారు. ఈ క్రమంలో అనేక వాయిదాలు ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్లు తీసుకునే సమయంలో విద్యార్థులే వాటిని చెల్లించక తప్పని స్థితిలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారన్నారు. జిఒ 77 రద్దు చేయాలని, పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు రూ.3000 వరకు పెంచాలని, పెండింగ్ బకాయిలను తక్షణమే చేయాలని, హాస్టళ్లలో పూర్తిస్థాయి వర్కర్స్‌ను నియమించాలని, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు . యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలని, డిగ్రీ కళాశాలకు పూర్తిస్థాయి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యాసంస్థలలో విద్యార్థుల మరణాలను అరికట్టాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో హెల్త్ వాలంటీర్లను నియమించాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబంలకు రూ.10లక్షలు చొప్పున ఇవ్వాలని, విద్యార్థుల మరణాలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థినీ, విద్యార్థులు అద్దెంట్లో నివాసముండి చదువుకోవాల్సిన దుస్థితి ఉందని, వెంటనే అనంతగిరిలో బాల,బాలికలకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పాడేరు మండల అధ్యక్ష, కార్యదర్సులు పి. ఆనబాబు, పి.సింహాద్రి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి.గోపాల్, కిరణ్, సాయి కిరణ్, లావణ్య, శరణ్య, వేనేలా, గణేష్, ఆనంద్, సాయి, వివిధ కాలేజీల నుంచి దాదాపు వెయ్యిమంది విద్యార్థులు పాల్గొన్నారు.
ర్యాలీ చేస్తున్న విద్యార్థులు