సౌత్‌-వెస్ట్‌ జోన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

Nov 27,2024 00:20

ప్రజాశక్తి – ఎఎన్‌యు: క్రీడల్లో పోటీతత్వం కంటే క్రీడా స్ఫూర్తి ఎంతో గొప్పదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ కె.గంగాధరరావు అన్నారు. వర్సిటీలోని వ్యాయామ విద్యా విభాగం ఆధ్వర్యంలో సౌత్‌- వెస్ట్‌ జోన్‌ మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ క్రీడాకారులు దేశానికి పట్టుగొమ్మలన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడలకున్న ప్రాధాన్యత మరే రంగంలో కూడా ఉండదన్నారు. క్రీడాకారులు తమ అభివృద్ధితోపాటు దేశ భవిష్యత్‌నూ దృష్టిలో పెట్టుకుని రాణించాలని చెప్పారు. నిరంతర శ్రమ విజేతలుగా నిలుపుతుందని చెప్పారు. అనంతరం రెక్టార్‌ కె.రత్నషీలామణి, రిజిస్ట్రార్‌ జి.సింహాచలం, క్రీడల నిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్‌ పిపిఎస్‌ పాల్‌ కుమార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా తొలిరోజు పోటీల్లో విజేతలకు పతకాలు అందజేశారు. ఆలిండియా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బడేటి వెంకటరామయ్య టెక్నికల్‌ కమిటీకి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్‌ పి.జాన్సన్‌, అధ్యాపకులు డాక్టర్‌ యిన్నయ్య, డాక్టర్‌ రామ్మోహన్‌రావు, డాక్టర్‌ డి.సూర్యనారాయణ పాల్గొన్నారు.
తొలిరోజు పోటీల్లో విజేతలు..
45 కేజీల విభాగంలో శివాజీ యూనివర్సిటీ (కొల్హాపూర్‌) క్రీడాకారిణి సర్గార్‌ కాజోల్‌ మహదేవ్‌ బంగారు పథకాన్ని సాధించారు. మంగళూరు యూనివర్సిటీకి చెందిన స్పందన వెండి పథకాన్ని పొందారు. యోగివేమన యూనివర్సిటీకి చెందిన ఆర్‌.గోగోయి మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించారు. 49 కేజీల విభాగంలో ముంబై యూనివర్సిటీ కి చెందిన సౌమ్య దాల్వి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. గుజరాత్‌లోని జైన్‌ యూనివర్సిటీ క్రీడాకారిణి తోక్చోం సంజు దేవి వెండి పథకాన్ని, కేరళా లోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్‌ క్రీడాకారిణి ఎన్‌.అను కాంస్య పథకం పొందారు. 55 కేజీల విభాగంలో శ్రీకాకుళంలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ క్రీడాకారిణి దూబా హేమశ్రీ బంగారు పథకాన్ని పొందగా గుజరాత్‌ లోని మార్వాడి యూనివర్సిటీ క్రీడాకారిని శర్మ విద్య రెండవ స్థానంలో నిలిచి వెండి పథకాన్ని సాధించారు. శివాజీ యూనివర్సిటీకి చెందిన కమలాకర్‌ నికిత సునీల్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకం పొందారు.

➡️