జూదం జరగకుండా డ్రోన్‌ల ద్వారా నిఘా : పల్నాడు ఎస్పీ

Jan 11,2025 00:12

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సంక్రాంతి నేపథ్యంలో జూదం, కోడిపందేలు, గుండాటలు తదితర నిషేధిత ఆటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు హెచ్చరించారు. జూదం నిర్వహణకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. పోలీసు ఉన్నత అధికారుల నుండి క్షేత్ర స్థాయి పోలీసు సిబ్బంది వరకు జిల్లా వ్యాప్తంగా పర్యటించి జూదం జరగకుండా ప్రత్యేక నిఘా, డ్రోన్‌ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. గతంలో కోడిపందాలు, పేకాటలు నిర్వహించిన, ఆడిన వారికి కౌన్సెలింగ్‌, బైండోవర్‌ చేశామని తెలిపారు. యువకులు జూదాలకు బానిసలై కేసుల్లో చిక్కుకొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. కోడిపందాలు, ఇతర నిషేధిత ఆటలు జరుగుతున్నట్లు తెలిస్తే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌ లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 112కు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

➡️