శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు : ఎస్‌పి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుం టామని ఎస్‌పి విద్యాసాగర్‌ నాయుడు హెచ్చరించారు. మార్చి 31న రంజాన్‌ పండుగ రోజున రాయచోటి పట్టణంలోని శివాలయం సర్కిల్‌లో రెండు గ్రూపులకు చెందిన వారు మారణాయుధాలతో పరస్పర దాడులకు పాల్పడ్డ ఘటనలో 9 మంది నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుండి ఇనుప రాడ్లు, ఇనుప చైన్లు, కర్రలు, 9 సెల్‌ ఫోన్‌ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రెండేళ్ల కిందట ఓ అమ్మాయి విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తిందని, దీంతో వారు పరస్పర దాడులకు పాల్పడేవారన్నారు. ఈ క్రమంలో రంజాన్‌ పండుగ రోజున రాయచోటి శివాలయం సర్కిల్‌ ో ఓ గ్రూపునకు చెందిన దేశముక్‌ అస్రాన్‌ అలీ ఖాన్‌, రియాన్‌ అలీ ఖాన్‌, అహ్మద్‌ బాషాలపై మరో గ్రూపునకు చెందిన వారు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇరు గ్రూపులకు చెందిన 24 మంది ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు అన్నారు. దేశముక్‌ అస్రాన్‌ అలీ ఖాన్‌, రియాన్‌ అలీ ఖాన్‌, అహ్మద్‌ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఈ కేసులో 24 మంది నిందితులలో 9 మంది నిందితులను అరెస్టు చేయగా, మరో 15 మంది నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. పరారైన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. రాయచోటి పట్టణంలో ఇప్పటికే 4 గ్యాంగులకు చెందిన 100 మందిని గుర్తించామని మీరందరిపై త్వరలో రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని అన్నారు. వీరిలో ఎవరిపైన అయినా 10 కేసులకు మించి ఉన్నట్లయితే అలాంటి నిందితులను పీడీ యాక్ట్‌ నమోదు చేసి నగర బహిష్కరణ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి అడ్మిన్‌ వెంకటాద్రి, అర్బన్‌ సిఐ చలపతి, ఎస్‌ఐ జహీర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️