బాధిత వృద్ధ దంపతుల ఇంటికి ఎస్పీ

Apr 10,2025 23:31

సమస్యను ఎస్పీకి వివరిస్తున్న దంపతులు
ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ :
ధైర్యంగా ఉండాలని మీకు న్యాయం చేస్తానని వృద్ధ దంపతులకు పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు భరోసానిచ్చారు. విజయపురిసౌత్‌లో గురువారం పర్యటించిన ఎస్పీ అదే గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అరికట్ల బ్రహ్మారెడ్డి, విజయలక్ష్మి దంపతులు ఇటీవల ఎస్పీని ఓ సమస్యపై ఆశ్రయించడంతో వారింటికి ఎస్పీ వెళ్లారు. దంపతులు 8.5 ఎకరాల పొలంతో పాటు ఆస్తులను మొత్తం అమ్మి తమ కొడుకు అంజిరెడ్డిని ఉన్నత చదువులు చదివించగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డారని, ఇప్పుడు తాము అనారోగ్యంతో బాధపతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అనారోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఆత్మహత్యాయత్నానికీ పాల్పడినట్లు ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము మాచర్ల పోలీసులకు తమ కొడుకు పై ఫిర్యాదు చేయగా అప్పటి ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తన కొడుకుకు మద్దతుగా నిలిచి కేసు పరిష్కారం కాకుండా చేశాడన్నారు. కోర్టులో కేసు వేయగా నెలకు రూ.10 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినా దాన్ని కూడా తమ కొడుకు ఖాతరు చేయలేదని వెస్పీకి వివరించారు. ఈ విషయంతో న్యాయం చేస్తానని ఎస్పీ హామీనిచ్చారు. ఎస్పీ వెంట మాచర్ల తహశీల్ధార్‌ కిరణ్‌ కుమార్‌, రూరల్‌ సీఐ నఫీజ్‌ బాష, విజయపురిసౌత్‌ ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ షఫీ ఉన్నారు.

➡️