కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు- ఎస్‌పి విద్యాసాగర్‌ నాయుడు

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ సంక్రాంతి పండగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌పి విద్యాసాగర్‌ నాయుడు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లా డుతూ సంక్రాంతి పండగ రోజులలో సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడి పందేలు, పేకాట, గుండాట, చెక్క బొమ్మ లాంటి ఆటలపై డబ్బు పెట్టి ఆడడం ప్రజల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎలాంటి పరిస్థితులలో ఉపేక్షించేది లేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని, కోడి పందేల జూదరులను, కోడి కత్తుల తయారీదారులను, పేకాట శిబిరాల నిర్వాహకులపై ఇప్పటికే బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. కావున ఎవరైనా జిల్లాలో కోడిపందాలు నిర్వహించిన వారికి ఆశ్రమం కల్పించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని కోరారు ఎక్కడైనా కోడి పందాలు, జూదం ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సంబంధిత పోలీసుస్టేషన్‌లో లేదా డయల్‌ 100కు సమాచారం తెలియజేయాలని కోరారు.

➡️