గర్భిణుల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ

Jun 11,2024 23:54 #dmho, #pregnent ladies
Pregnent ladies, Dmho

ప్రజాశక్తి -యంత్రాంగం ఆనందపురం : గర్భిణులు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు ఆదేశించారు. ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన ఆశ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. గర్భిణులను మూడు నెలలలోపుగానే నమోదు చేయాలన్నారు. త్వరగా నమోదు చేయడం వల్ల అవసరమైన సేవలు అందించడానికి వీలుంటుందని చెప్పారు. అవసరమైన స్కాన్స్‌ జిల్లా వైద్య శాఖ గుర్తించిన స్కానింగ్‌ సెంటర్లలో చేయించాలని ఆదేశించారు. పిహెచ్‌సి వైద్యాధికారి నుంచి వచ్చే స్కాన్స్‌ చేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు తల్లీబిడ్డ వాహనం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆశ కార్యకర్తలు ఈ ఆశ యాప్‌ను ప్రతిరోజూ ఉపయోగించాలని ఆదేశించారు. కిల్కారీ మొబైల్‌ యాప్‌ సేవలు గర్భిణులకు ఉపయోగపడేలా, కిల్కారీ మొబైల్‌ నుంచి వచ్చే ఫోన్‌ వినేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. డయోరియా రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దలకు బీసీజీ వాక్సినేషన్‌ కార్యక్రమంపై ఆయన సమీక్షించారు. తొలుత నూతనంగా నిర్మితమవుతున్న భవనాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఉమావతి, ఎన్‌హెచ్‌ఎం పరిపాలన అధికారి రమేష్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్‌ ఎం.గంగునాయుడు, షహనాజ్‌ సాధియా, జిల్లా కేంద్రం ఆరోగ్య విస్తరణాధికారి నాగభూషణం, ఆరోగ్యకార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.తాళ్లవలస పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్‌ఒ తగరపువలస : భీమిలి మండలం ఆర్‌ తాళ్లవలస పిహెచ్‌సిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు, బిసిజి ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఉమావతి మంగళవారం సందర్శించారు. వైద్య, ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలతో పాటు మే 16న ప్రారంభమైన బిసిజి టీకాల కార్యక్రమం అమలుపై సమీక్ష జరిపారు. మే 16 నుంచి ఇప్పటి వరకు సుమారు 2,700 మందికి బిసిజి టీకాలు వేసినట్లు పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జునరావు వివరించారు. వైద్య, ఆరోగ్య పథకాల అమలు పట్ల డిఎం అండ్‌ హెచ్‌ఒ సంతృప్తి వ్యక్తం జేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

➡️