గర్భిణులకు ప్రత్యేక తనిఖీలు

Jun 10,2024 23:52 #medical, #pregnent ladies
pregnent ladies treatment

 ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణులకు పిఎంఎంఎస్‌వై కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్‌ ఎం.గంగునాయుడు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 42 మంది గర్భిణులు అవసరమైన సేవలు పొందారు. అందరికీ అవసరమైన ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్‌ ఎం.గంగునాయుడు, షహానాజ్‌ సాధియా మాట్లాడుతూ, గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. హైరిస్క్‌ గర్భిణుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతినెలా ఎఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పి ల వద్ద తనిఖీలు చేయించుకున్న గర్భిణులు ఆరవ నెలనుంచి ప్రసవం అయ్యేవరకు ప్రతి నెలా వైద్యాధికారి వద్ద తనిఖీ నిర్వహించుకోవాలని చెప్పారు. దీని వల్ల సుఖ ప్రసవాలు జరుగుతాయని తెలిపారు. హైరిస్క్‌ గర్భిణులను కెజిహెచ్‌ లాంటి పెద్ద ఆసుపత్రులను పంపడానికి వైద్య అధికారి పరీక్షలు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రతి నెలా 9, 10 తేదీల్లో పిఎంఎంఎస్‌వై కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు తనిఖీలు పిహెచ్‌సిలో జరుగుతాయని, గర్భిణులు ఈ సేవలు ఉపయోగించుకునేలా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్యాధికారి పి.సాంబమూర్తి, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమోహన్‌, పార్వతమ్మ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఈశ్వరరావు, ఫార్మసీ ఆఫీసర్‌ జయకుమార్‌, ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️