జిల్లాలకు ప్రత్యేక అధికారులు

Mar 12,2025 00:22

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణ పల్నాడుకు, కృతిక శుక్లాను బాపట్ల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు, పరిపాలనను బలోపేతం చేసేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమస్యల సత్వర పరిష్కారానికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల్ని జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులను జోనల్‌ ఇన్‌ఛార్జులుగా ప్రభుత్వం నియమించింది. జిల్లా ఇన్‌ఛార్జులుగా నియమించిన అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో పాల్గొని జిల్లా కలెక్టర్‌, ఇతర జిల్లా అధికారులకు సహాయకారిగా ఉండాలి. పక్షం రోజులకోసారి జిల్లా అధికారులతో సమీక్ష సమా వేశాలు నిర్వహించాలి. గ్రామాల్లో పర్యటించాలి. నెలకు కనీసం రెండుసార్లు గ్రామాల్లో రాత్రి బస చేయాలి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించాలి. తగు చర్యలు చేపట్టాలి. నెలవారీ పురోగతి నివేదికను జోనల్‌ ఇన్‌ఛార్జి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జోనల్‌ ఇన్‌ఛార్జులు ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించాలి. నెలవారీ సమీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల్లో పాల్గొనాలనీ సూచించారు. ప్రతినెలా 1న పింఛన్ల పంపిణీ, ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. నెలకోసారి గ్రామాలను సందర్శించి అక్కడ రాత్రి బస చేయాలని, పారిశ్రామి కవేత్తలు, రైతులు, లబ్ధిదారులు, ప్రజాప్రతి నిధులు, పన్ను చెల్లింపుదారులతో చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ధేచించింది. జిల్లా కలెక్టర్లు, కీలక అధికారులకు పరిపాలనా సంబంధిత శిక్షణ అందించాలని మార్గదర్శకాలు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార స్థితిని సమీక్షించాలని, ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అవాంతరాలను గుర్తించి, జాప్యానికి కారణాలను విశ్లేషించాలని, ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, వ్యయాన్ని సమీక్షించాలని జిల్లా పురోగతి, సమస్యలు, సిఫారసులను ముఖ్య కార్యదర్శికి నివేదించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

➡️