గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌

Jun 11,2024 21:44

ప్రజాశక్తి – సీతానగరం:  గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పారిశుధ్య డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం పెద్ద ఎత్తున డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా సీతానగరం మండలంలోని కాసాపేట, చినభోగిల, లచ్చయ్యపేట, అంటిపేట తదితర గ్రామాల్లో ని కాలువల్లో పూడిక తీత, దోమల లార్వా నివారణ పిచికారీ (ఎఎల్‌ఒ) కార్యకలాపాలను చేపట్టారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా, దోమలు వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక రసాయనాలను పిచికారీ చేయించారు. పూడికలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు, బావులు, కొళాయిలు, బోరుల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా వివిధ పనులు చేపట్టారు. జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాల మేరకు దోమలపై దండయాత్ర చేపట్టారు. జిల్లాలో దోమల వ్యాప్తి నివారణకు విధిగా అన్ని గ్రామాల్లో పారిశుధ్య డ్రైవ్‌ నిర్వహించి లార్వా వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. తాగునీటి సరఫరా పైపుల పరిస్థితి తనిఖీ, తాగు నీరు కలుషితం కాకుండా శ్రద్ద వహించారు. బ్లీచింగ్‌ వేయడం, తుప్పలు తొలగింపు, బహిరంగ మలవిసర్జనకు చర్యలు చేపట్టారు. ప్రజారోగ్య ఆవశ్యకత దృష్ట్యా పలు కార్యక్రమాలను నిర్వహించారు. కొత్తవలసలో…పాచిపెంట : మండలంలోని కొటికిపెంట పంచాయతీలో గల కొత్తవలసలో సర్పంచ్‌ ఇజ్జాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం పారిశుధ్య కార్మికులతో పారిశుధ్య పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికలు రోడ్లపై చెత్త చెదారాలు కార్మికులతో తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ అప్పలనాయుడు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దరిచేరవని ముఖ్యంగా దోమల బెడద తగ్గి మలేరియా, టైఫాయిడ్‌. డెంగీ వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చని, గ్రామస్తులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

➡️