4 నుంచి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-రాయచోటి అక్టోబర్‌ 4 నుండి 6 వరకు మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గుంటూరులో నిర్వహించనున్నట్లు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్‌, ఎస్‌. జాబీర్‌ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యుటియఫ్‌ సంఘం స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడలో డిసెంబర్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు వివిధ అంశాలలో క్రీడా పోటీలు నిర్వహించి వారిలో పని ఒత్తిడి నుంచి ఉత్సాహ ఫలితమైన వాతావరణంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి ఆటల పోటీలు 29న రాయచోటిలో నేతాజీ సర్కిల్‌ వద్దగల ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో విజేతలైన వారికి రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు అక్టోబర్‌ 4 నుండి 6 వరకు మూడు రోజుల పాటు దసరా సెలవుల్లో గుంటూరులో నిర్వహించాలని రాష్ట్ర సంఘం నిర్ణయించిందన్నారు. క్రీడల్లో ఆసక్తి కలిగిన అన్నమయ్య జిల్లాలోని ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ మండల శాఖల ద్వారా జిల్లా స్థాయి ఆటల పోటీలలో పాల్గొని జయప్రదంగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా కోరారు. క్రీడాంశాలకు సంబంధించి పురుషులకు క్రికెట్‌, చెస్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌ (సింగిల్స్‌ , డబుల్స్‌), క్యారమ్స్‌ 100 మీటర్ల రన్నింగ్‌, 400 మీటర్ల వాకింగ్‌, షాట్‌పుట్‌, మహిళలకు టెన్నికాయిట్‌, చెస్‌, క్యారమ్స్‌, 100 మీటర్ల రన్నింగ్‌, 400 మీటర్ల వాకింగ్‌, షాట్‌పుట్‌ నిర్వహిస్తామన్నారు. పై క్రీడాంశాలు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలలో పాల్గొనేవారు రెగ్యులర్‌ ఉపాధ్యాయులై ఉండాలన్నారు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులై ఉండాలని తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తేడా పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దావుద్దీన్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్ర రెడ్డి, అనిల్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, సహాధ్యక్షులు కిఫాయత్‌, హఫీజుల్లా,రాజా రమేష్‌, సహాధ్యక్షులు రెడ్డి, బసవ, పాల్గొన్నారు.

➡️