ముగిసిన విద్యుత్‌ ఉద్యోగుల క్రీడా పోటీలు

Nov 27,2024 21:30

 అథ్లెటిక్స్‌లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా తిరుపతి

ద్వితీయ స్థానం విజయవాడ  

మూడో స్థానంలో విజయనగరం జట్టు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : స్థానిక రాజీవ్‌ గాంధీ క్రీడా మైదానంలో మూడు రోజులు పాటు జరిగిన విద్యుత్‌ ఉద్యోగుల అథ్లెటిక్స్‌, టేబుల్‌ టెన్నిస్‌ రాష్ట్ర క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు అథ్లెటిక్స్‌ లో 100,400,800,1000 మీటర్లు పరుగు పందెం, రిలే, లాంగ్‌ జంప్‌, హై జంప్‌, త్రోబాల్‌, డిస్కస్‌ త్రో, టేబుల్‌ టెన్నిస్‌ లో సింగిల్స్‌, డబుల్స్‌ విభాగంలో క్రీడా పోటీలు జరిగాయి. బహుమతి ప్రదాన కార్యక్రమం స్థానిక క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగింది. అథ్లెటిక్స్‌ విభాగంలో ఓవరాల్‌ ఛాంప్‌ గా తిరుపతి జిల్లా, ద్వితీయ స్థానం విజయవాడ, మూడో స్థానం లో విజయనగరం జిల్లా నిలిచాయి. విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎపిఇపిడిసి ఎల్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ డైరెక్టర్‌ రామచంద్ర ప్రసాద్‌, జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.మాసిలామణి , విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ ఎస్‌.లక్ష్మణరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఇ బాలాజీ చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. వ్యక్తిగత పోటీల్లో మొదటి,ద్వితీయ స్థానాల్లో నిలిచిన అథ్లెటిక్స్‌, టేబుల్‌ టెన్నిస్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. డిసెంబర్‌ లో జరగనున్న జాతీయ అథ్లెటిక్స్‌, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. . ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా హాజరైన వారు మూడు రోజులు పాటు ఉత్సాహంగా క్రీడా పోటీలు నిర్వహించిన జిల్లా విద్యుత్‌ శాఖ అధికారులను,ఉద్యోగులను అభినందించారు.ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింప చేయాలని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఉద్యోగుల క్రీడా కార్యదర్శి పి.త్రినాధరావు, క్రీడాధికారి వడివేలు పాల్గొన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులను ముఖ్య అతిధులు చేతులు మీదుగా సత్కరించారు.

➡️