మే నెల 12 తేదిన శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరా మహోత్సవము

Apr 15,2025 17:16 #in Vizianagaram

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : మే నెల 12వ తేదీన పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం జరుగుతుందని అమ్మవారి దేవస్థానం ఉప కమీషనర్ కె ఏం వి డి వి ప్రసాదరావు తెలిపారు. మంగళవారం దేవస్థానం కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విజయనగరం పట్టణములో వేంచేసియున్న పైడితల్లి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయము. సత్యం గల అమ్మవారు. సిరులిచ్చే దేవతగాను, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగాను భక్తకోటికి కొంగుబంగారమై వెలసింది. అట్టి పసిడి కాంతుల శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరా మహోత్సవ ఊరేగింపు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు పసంగుడి నుండి బయలుదేరి గంటస్తంభం మీదుగా హుకుంపేట చేరును. తిరిగి రాత్రి పది గంటలకు హుకుంపేటలో గల శ్రీ అమ్మవారి చదురు వద్ద నుండి 13-05-2025 తేదీ (మంగళవారం ) ఉదయానికి మూడులాంతర్ల వద్ద గల చదురుగుడికి శ్రీ అమ్మవారు వేంచేస్తారన్నారు. అప్పటి నుండి ఉయ్యాలకంబాల ఉత్సవము వరకు శ్రీ అమ్మవారు చదురుగుడిలో కొలువై ఉంటారన్నారు. విలేకర్ల సమావేశంలో సిబ్బంది, ఆలయ పూజారి వెంకటరమణ పాల్గొన్నారు.

➡️