అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్‌

అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         పుట్టపర్తి అర్బన్‌ : వివిధ సమస్యలపై స్పందన గ్రీవెన్స్‌లో ప్రజలు అందించే అర్జీల పరిష్కారంపై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 214 వినతులను డిఆర్‌ఒ కొండయ్య, గ్రామ వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి, డిపిఒ విజరు కుమార్‌తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈనెల 29 లోపు ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను ఆయా మండలాల ప్రత్యేక అధికారులు స్థానిక ఎమ్మెల్యేల అనుమతితో ప్రారంభించాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు 72, గ్రామ సచివాలయాలు 46, వైయస్సార్‌ హెల్త్‌ క్లీనిక్‌లు మొత్తం 188 ఉన్నాయని వాటిని ప్రారంభించే కార్యక్రమాలు సంబంధిత అధికారులు చేపట్టాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన క్లైముల్‌ను మంగళవారం సాయంత్రంలోపు పరిష్కరించాలన్నారు. ఉపాధి పనులపై ఏరోజుకారోజు ఎంపిడిఒలు నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️