కాపు స్విచ్చాఫ్‌..!

            అనంతపురం ప్రతినిధి : రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఫోన్‌ స్వీచ్చాఫ్‌ చేసి ఎవరికీ అందబాటులో లేకుండా ఉండటం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. ఆయనకు వైసిపి పెద్దల నుంచి వెల్‌కమ్‌ లభించిందన్న ప్రచారమూ నడుస్తోంది. అయితే దీనిపై స్పష్టమైన నిర్ధారణేది లేనప్పటికీ ఆయన మొబైల్‌ఫోన్‌ కూడా స్వీచ్ఛాఫ్‌ చేసి స్థానిక నేతలకు కూడా దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఆయన వైసిపి నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రాయదుర్గం అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా మెట్టు గోవిందరెడ్డిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసిపి నాయకులు ఆయనకు మధ్య కూడా దూరం పెరిగింది. మున్సిపల్‌ సమావేశంలోనూ ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కానట్టుగానే వైసిపి ఛైర్మన్‌ మొదలుకుని కౌన్సిలర్లు కొంత మంది వ్యవహరించారు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారన్న ప్రచరాం జోరుగా సాగుతూ వస్తోంది. ఎఐసిసి సభ్యులైన రఘువీరారెడ్డిని ఆయన నివాసానికి కుటుంబ సమావేతంగా వెళ్లి కాపు రామచంద్రారెడ్డి కలసొచ్చారు. ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిల ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనలోనే చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన చేరిక జరగలేదు. రాబోయే రోజుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆయనకు తిరిగి వైసిపి పెద్దల నుంచి పిలుపు వచ్చిందన్న ప్రచారం రెండు రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఆయన మాత్రం ఎక్కడా బయటకు విషయం వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన అందుబాటులో లేకుండా ఉండటం వెనుక బలమైన రాజకీయ కారణం ఏదైనా ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. అధిష్టానం అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి వచ్చిందా.. లేక ఇతర నాయకుల నుంచి ఈ ప్రయత్నం జరిగిందా అన్న దానిపై స్పష్టత లేదు. వైసిపి నుంచి బయటకు వస్తున్నా అన్న సమయంలో ముఖ్యమంత్రిని కలువడానికి ప్రయత్నించినా అవకాశం లేకపోవడంతోనే బయటకు వస్తున్నా అంటూ తాడేపల్లికి గుడ్‌బై చెప్పి వచ్చారు. వైసిపి ఆవిర్భావం నుంచి జగన్మోహన్‌రెడ్డి వెంట నడిస్తే తనకు గుర్తింపు లేకుండాపోయిందని ఆయన తన మద్దతుదారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక కాపునకు మంత్రి పదవుల్లో స్థానం లభిస్తుందని ఆశించినా అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు జరగబొయే సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా టిక్కెట్టు కూడా లేదనే సరికి వైసిపికి గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తిరిగి పిలుపొస్తే ఏమి చేస్తారన్న చర్చ నడుస్తోంది. అధిష్టానం నుంచి పిలుపొచ్చి సర్ధిజెప్పే ప్రయత్నం చేస్తే ఒప్పుకుంటారా లేదా అన్నది రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన బయటకొచ్చి ఏదైనా ప్రకటన చేస్తే తప్ప ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. నేడు కణేకల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో కాపు పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అక్కడైనా దీనిపై ఒక క్లారిటీని ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

➡️