కావాలనే పింఛన్ల పంపిణీ ఆలస్యం : టిడిపి

డిఆర్‌ఒకు వినతిపత్రం ఇస్తున్న టిడిపి నాయకులు

          పుట్టపర్తి అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఉద్ధేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేస్తూ, టిడిపి, ఎన్నికల కమిషన్‌పై నిందలు వేస్తున్నాడని టిడిపి జిల్లా అధ్యక్షుడు బివి.వెంకటరాముడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో వద్ధులు, వికలాంగులకు ఇతరులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కోరుతూ డిఆర్‌ఒ కొండయ్యకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖజానాలో ఉన్న నిధులను తన సొంత కాంట్రాక్టర్లకు చెల్లించినందునే ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందన్నారు. సకాలంలో పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేక ఆ నెపం టిడిపిపై వేస్తూ పింఛన్ల వ్యవహారాన్ని కూడా జగన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై ఎన్నికల కమిషన్‌ వైసీపీకి అనుకూలంగా ఉన్నారని వారిని తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇవన్నీ తెలిసి కూడా టిడిపిపై బురద చల్లడం జగన్‌ రెడ్డి రాజకీయమన్నారు. సచివాలయాల సిబ్బందితో వెంటనే పింఛన్లు పంపిణీ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, రాష్ట్ర మైనార్టీ నాయకుడు మహమ్మద్‌ రఫీ, నాయకులు గూడూరు ఓబులేసు, దయ్యాల ఉమాపతి, మాల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️