నీటి కోసం గ్రామస్తుల నిరసన

పెనుకొండ, పావగడ రహదారిపై రాస్తారోకో చేస్తున్న ఆర్‌.మరువపల్లి గ్రామస్తులు

         రొద్దం : తాగునిటీ కోసం మండల పరిధిలోని ఆర్‌.మరువపల్లి గ్రామస్తులు ఆందోళనబాట పట్టారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైటాయించి నిరసనకు దిగారు. దాదాపు నాలుగు నెలల నుంచి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుకొండ, పావగడ ప్రధాన రహదారిలో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా బైటాయించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా గ్రామంలో నీటిసమస్య లేదన్నారు. గడిచిన రెండేళ్ల నుంచి నీటి సమస్య తీవ్రం అయ్యిందన్నారు. నాలుగు నెలలుగా బిసి కాలనీకి నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. బిసి కాలనీకి నీటిని సరఫరా చేసే బోరుబావి చెరువు వద్ద ఉందన్నారు. ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో నీటి సరఫరా కావడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చేసేది లేక ఆందోళన బాట పట్టామన్నారు. తక్షణం నీటి సమస్యను పరిష్కరించాలని అంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. గ్రామస్తుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎంపీడీవో కేశవరెడ్డి అక్కడ చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా పంచాయతీ నీటిని వాడుకుంటున్న కనెక్షన్లను తొలగించి సమస్యను పరిష్కరిస్తామని ఎంపిడిఒ హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా మహిళా అధ్యక్షులు సుబ్బరత్నమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, చిన్నప్పయ్య, చంద్రమౌళి, నరసింహులు, టైలర్‌ ఆంజనేయులు, వీరాంజి, గ్రామస్తులు జయశేఖర్‌, శ్రీనివాసులు, జయరాములు, శ్రీకాంత్‌, శ్రీధర్‌, మారుతితో పాటు మహిళలు పాల్కొన్నారు.

➡️