పింఛన్ల పంపిణీ ఆపి చంద్రబాబుపై నిందలా..?: టిడిపి

Apr 1,2024 22:51

 సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

                           పుట్టపర్తి రూరల్‌ : సామాజిక పింఛన్ల పంపిణీని ఆపి చంద్రబాబునాయుడిపై నిందలు వేయడం అన్యాయమని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. ఏప్రిల్‌ ఒకటి, రెండు తేదీల్లో గ్రామ ,వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా తప్పనిసరిగా ఇంటింటికి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని అయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్లు కోసం వైసీపీ ప్రభుత్వ పెద్దలు వాలంటీర్లు లేరనే సాకుతో పింఛన్ల పంపిణీని ఆపి ఆ నిందను టీడీపీ అధినేత చంద్రబాబు పై వేసేందుకు స్కెచ్‌ వేసిందని విమర్శించారు. వాలంటీర్లు లేరనే సాకుతో పింఛన్ల పంపిణీ ఆలస్యం చేయకూడదని వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎన్నికల కమిషన్‌ను కోరారని గుర్తు చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిపై వైసీపీ పెద్దలకు నమ్మకం లేకనే పింఛన్ల పంపిణీకి జాప్యం చేస్తున్నారని విమర్శించారు.

ధర్మవరం టౌన్‌ :పింఛన్లు పంపిణీ చేసేందుకు నిధులు లేక టీడీపీ ఏదో చేసినట్టు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. అనంతపురంలోని తన నివాసంలో సోమవారం టీడీపీ, బీజేపీ ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు డబ్బు దోచి పెట్టి సీఎం జగన్‌ కొత్తనాటకానికి తెరలేపారన్నారు. పైగా దీనిని ఎన్నికలలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మార్చి 16-30 మధ్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శిం చారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణమని ఎన్నికల కమిషన్‌, టీడీపీ కాదని అన్నారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకంగా కాదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వలంటీర్లను కొనసాగిస్తామని, పార్టీలకు అతీతంగా పనిచేసేలా చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. ఈనెల 4 కూటమి అభ్యర్థి సత్యకుమార్‌ ధర్మవరానికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు వాటిపై సమాలోచనలు చేశామన్నారు. ధర్మవరంలో జనసేన కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని కూడా కలుపుకుని ముందుకువెళ్లామని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

➡️