ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం : సిపిఎం

 వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

            పుట్టపర్తి రూరల్‌ : పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను వెంటనే పరిరక్షించాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం నాడు జిల్లా కేంద్రంలో డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖతో పాటు రెవెన్యూ, పుడా, సచివాలయ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ మాట్లాడుతూ పుట్టపర్తి మండల పరిధిలోని ఎనుములపల్లి సర్వేనెంబర్‌ 454-2, 454-3, 454-6లో 7.66 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. పెద్ద భవనాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ను నిర్మించారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సర్వేనెంబర్‌ 308 కప్పలబండ పొలంలో 21.42 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులు కబ్జా చేశారన్నారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాలను తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిందన్నారు. పుట్టపర్తి, పరిసర మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉందని తక్షణం వీటిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌, పుట్టపర్తి పట్టణ కార్యదర్శి బ్యాల్లా అంజి, రామకృష్ణ, సిపిఎం ఆఫీస్‌ కార్యదర్శి సిద్దు పాల్గొన్నారు.

➡️