మున్సిపల్‌ కార్యాలయంలో గుత్తేదారుల ఆందోళన

Apr 1,2024 22:50

అకౌంట్స్‌ విభాగంలో ధ్వంసం అయిన ఫర్నీచర్‌

                    హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో గుత్తేదారులు ఆందోళనకు దిగారు. పురపాలక సంఘ వ్యాప్తంగా తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను సిఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రూ. కోట్లల్లో బిల్లుల చెల్లింపు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు అధికారులు పట్టించు కోకపోవడంతో సహనం కోల్పోయిన గుత్తేదారులు మున్సిపల్‌ కార్యాలయంలోని అకౌంటెంట్‌ గదిలోకి దూసుకెళ్లి గది కిటికీ అద్దాలు, టేబుల్‌ మీద ఉన్న అద్దం, ఫర్నీచర్‌ తో పాటు కంప్యూటర్‌ మానిటర్‌ సైతం పగలు కొట్టారు. ఆందోళన ఉధృతం కావడంతో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న గుత్తేదారులకు నచ్చజెప్పి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్బంగా గుత్తేదారులు ప్రభాకర్‌, బాలాజిలు మాట్లాడుతు గత 8 నెలల నుంచి చేసిన అభివృద్ధి పనులకు సంబందించిన బిల్లులను మున్సిపల్‌ కార్యలయంలోని అకౌంట్స్‌, ప్రీ ఆడిట్‌ అధికారులు సకాలంలో సిఎఫ్‌ఎంఎస్‌ లో అప్‌లోడ్‌ చేయక పోవడంతో తమకు బిల్లులు రాలేదన్నారు. పురపాలక సంఘంలో 15 మంది గుత్తేదారులు గత 8 నెలల కాలంగా అప్పులు చేసి దాదాపు రూ.3కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నప్పటికి అకౌంట్స్‌ విభాగం వారు ఒకరిపై ఒకరు వేసుకుంటు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చేసిన అన్ని పనులకు బిల్లులు చేయలేదని, కేవలం రూ.1.24 కోట్ల బిల్లులు మాత్రమే సిఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారని అన్నారు. ఇంకా దాదాపు రూ. 2కోట్ల వరకు బిల్లులు అప్‌లోడ్‌ చేయలేదన్నారు. అప్‌లోడ్‌ చేసిన బిల్లులను సైతం ప్రీ ఆడిట్‌లో విధులు నిర్వహిస్తున్న రవి శంకర్‌ తనకు మాముళ్లు ఇవ్వలేదని, అప్రూవల్‌ చేయక పోవడంతో అవి సైతం నిలచి పోవడం జరిగిందన్నారు. తాము ఎదో మిగులుతుందని అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని మార్చి నెలలో అన్ని బిల్లులు వస్తాయని, ఎప్రిల్‌ లో చెల్లిచాంల్సిన అప్పులను చెల్లిస్తామని అందరికి చెప్పామని అన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా అకౌంటెడ్‌, ప్రీ ఆడిట్‌ అధికారులు తమ బిల్లుల విషయంలో నిర్లక్ష్యం చేయడంతో కడుపు కాలి తిరగబడ్డమన్నారు. ఇంత జరుగుతున్నా తన దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని కమిషనర్‌ అడిగారు. ప్రతి రోజు అకౌంట్‌, ప్రీ ఆడిట్‌ అధికారులు తాము చేస్తామని చెప్పారని కమీషన్‌ కోసం ఇలా చేస్తారని ఊహించలేదని అన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలే కాని కార్యాలయం పై దాడి చేయడం వల్ల బిల్లులు వస్తాయా అని కమిషనర్‌ అన్నారు. సమస్యకు పరిష్కారం చూపక ముందే ఇలా చేయడం తగదని కమిషనర్‌ అన్నారు. రవి శంకర్‌ ఉంటే తాము అభివద్ధి పనులు చేయలేమన్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారితే తమ బిల్లులు మంజూరు కాక పోతే ఎవరు భాధ్యత వహిస్తారని కమిషనర్‌ను గుత్తేదారులు ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు మంజూరు అయ్యే విధంగా తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫర్నీచర్‌ ధ్వంసంపై కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి వివరణ కోరగ జరిగిన సంఘటనపై పరిశీలించి వారిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

➡️