మోటార్లకు మీటర్లు… రైతుల మెడకు ఉరితాళ్లు

Feb 12,2024 22:35

మీటర్ల బిగింపును అడ్డుకుంటున్న నాయకులు, రైతులు

                    మడకశిర : మోటర్లను మీటర్లు బిగింపు చర్యలు రైతుల మెడకు ఉరితాళ్లే అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిధిలోని కళ్లుమర్రి పంచాయతీలోని రైతుల మోటార్లకు విద్యుత్‌ అధికారులు, గుత్తేదారులు మీటర్లు బిగించడాన్ని సర్పంచి గంగమ్మ నాగరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అడుగంటిపోయిన బోరు బావుల్లో నీరు లేక ఇప్పటికే నష్టపోతున్నామన్నారు. ఈ మీటర్లు బిగిస్తే రూ.5వేల నుండి 6వేల రూపాయల దాకా బిల్లు వస్తుందని ఆమొత్తాన్ని ఎవరు కడతారని ప్రశ్నించారు. పంటలు పండక రైతులు ఇప్పటికే నానారకాలుగా నష్టపోతున్నారని అన్నారు. కర్నాటకకు చెందిన సురేష్‌ కు కాంట్రాక్ట్‌ ప్రభుత్వం అప్పగించిందని మోటార్లకు మీటర్లు బిగించడానికి వచ్చిన సూపర్‌ వైజర్‌ తెలిపారు. లైన్మెన్‌ అనుమతి తీసుకున్నామన్నారు. అయినప్పటికీ రైతులు మీటర్ల బిగింపును అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గంగమ్మ నాగరాజు, సదాశివరెడ్డి, నరసింహప్ప, నర్సీగౌడ, పెద్ద మూర్తి, నరసన్న, కొండప్ప, కదిరి ప్రభాకర్‌, ముని, నరసింహ రెడ్డి, నర్సిరెడ్డి, సత్యనారాయణ, సోమశేఖర్‌, గోవర్ధన్‌ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️